కలం, స్పోర్ట్స్: సెమీఫైనల్ లో ఎదురైన పరాజయాన్ని మరిపించాలనే పట్టుదలతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. మరోవైపు ఫ్రాన్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా దాడులు కొనసాగించడంతో.. ఫ్లోరిడాలోని మియామి స్టేడియంలో గోల్స్ వర్షం కురిసింది. చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన ఈ పోరు ఫుట్ బాల్ (England vs France) అభిమానులకు చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చింది.
ఫస్ట్-హాఫ్ లోనే గోల్స్ సునామీ..
మ్యాచ్ ప్రారంభమైన మూడో నిమిషంలోనే ఇంగ్లండ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. డెక్లాన్ రైస్ అద్భుతమైన స్ట్రైక్ తో ఫ్రాన్స్ గోల్ పోస్ట్ ను బద్దలు కొట్టి జట్టుకు శుభారంభం అందించాడు. ఆ తర్వాత 18వ నిమిషంలో రైస్ అందించిన కార్నర్ను ఎజ్రి కోన్సా శక్తివంతమైన హెడర్ లో గోల్ గా మలిచాడు. ఇక బుకాయో సాకా.. ఫ్రాన్స్ డిఫెన్స్ కు చుక్కలు చూపించాడు. 37వ నిమిషంలో తొలి గోల్ చేసిన సాకా.. విరామానికి ముందు మరోసారి బంతిని నెట్ లోకి పంపాడు. దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి ఇంగ్లండ్ 4-0తో భారీ ఆధిక్యంలో నిలిచింది.
ఫ్రాన్స్ వీరోచిత పోరాటం..
ఫ్రాన్స్ ఓటమి అంచుల్లో ఉన్నప్పటికీ.. సెండాఫ్ లో అసలైన పోరాటం మొదలుపెట్టింది. వ్యూహాలు మార్చి, దూకుడు పెంచింది. కెప్టెన్ కిలియన్ ఎంబాపే 48వ నిమిషంలో గోల్ చేసి పునరాగమనానికి బాటలు వేశాడు. ఆ తర్వాత బ్రాడ్లీ బార్కోలా మరో గోల్ చేయడంతో స్కోరు 4-2కు చేరింది. 66వ నిమిషంలో ఎంబాపే మరోసారి మెరిసి గోల్ చేయడంతో ఫ్రాన్స్ కేవలం ఒక్క గోల్ దూరంలో నిలిచింది. ఈ గోల్ తో ప్రపంచకప్ చరిత్రలో 22 గోల్స్‌తో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ఎంబాపే కొత్త రికార్డు నెలకొల్పాడు.
పెనాల్టీ డ్రామా.. సాకా హాట్రిక్..
ఫ్రాన్స్ సమం చేసేలా కనిపించిన సమయంలో ఇంగ్లండ్ కు కీలక అవకాశం లభించింది. పెనాల్టీని 87వ నిమిషంలో బుకాయో సాకా గోల్ గా మలిచి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. అయినా ఫ్రాన్స్ చివరి వరకు పోరాడింది. ఇంజూరీ టైమ్ లో 90+6వ నిమిషంలో ఉస్మాన్ డెంబ్లే గోల్ చేసి ఉత్కంఠను మరింత పెంచాడు. అయితే మ్యాచ్ ముగియడానికి కొన్ని క్షణాల ముందు జూడ్ బెల్లింగ్హామ్ తన మ్యాజిక్ చూపించాడు. 90+8వ నిమిషంలో హాఫ్ వే లైన్ దగ్గర బంతిని అందుకున్న అతడు ఫ్రాన్స్ డిఫెండర్లను దాటుకుంటూ చేసిన అద్భుతమైన సోలో రన్ తో బంతిని నెట్లోకి పంపాడు. ఆ ఒక్క గోల్ తో ఇంగ్లండ్ విజయం ఖరారైంది.
వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థ్రిల్లర్స్ (బాక్స్)
ఈ థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ కు మరో ప్రత్యేకత ఉంది. ఒకే మ్యాచ్ లో ఏకంగా 10 గోల్స్ నమోదై వరల్డ్ కప్ కు చరిత్రలో అత్యధిక స్కోరింగ్ మ్యాచ్ గా నిలిచింది. 1982 ప్రపంచకప్ తర్వాత ఇంత భారీ స్థాయిలో గోల్స్ నమోదైన మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఒకవైపు బుకాయో సాకా హ్యాట్రిక్ తో ఇంగ్లండ్‌ను గెలుపు బాట పట్టించగా.. మరోవైపు కిలియన్ ఎంబాపె చారిత్రక గోల్ తో కొత్త రికార్డు నెలకొల్పాడు. చివరి నిమిషాల వరకు ఉత్కంఠ కొనసాగడం, ఇంజూరీ టైమ్ లోనూ గోల్స్ నమోదు కావడంతో ఈ పోరు ఈ టోర్నీలోనే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ లలో ఒకటిగా నిలిచిపోయింది. ఫుట్‌బాల్ అభిమానులకు ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే ‘వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థ్రిల్లర్స్’గా మిగిలిపోనుంది.

