కలం, వెబ్ డెస్క్: ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వచ్చినప్పటి నుంచి వైసీపీ మావిగన్ (Mavigun)పై ప్రచారాన్ని తీవ్రం చేస్తోంది. ఏపీ రాజధానిగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను తీసుకొని మావిగన్ అని పేరు పెట్టాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ప్రతిపాదించారు. దీంతో వైసీపీ నేతలంతా మావిగన్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ రాజధాని పెడితే తక్కువ ఖర్చు అవుతుందని చెప్తున్నారు. రాజధానిపై అటు కూటమి పార్టీలు, ఇటు వైసీపీ మధ్య తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో తాడేపల్లిలో మావిగన్ పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. మావిగన్ పేరుతో జగన్ ఇంటి ముందు అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మూడు జిల్లాల మావిగన్‌తోనే అభివృద్ధి అని, ఒక పార్టీ, ఒక జెండా, ఒకటే అజెండా అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. తాడేపల్లిలోని పాత టోల్ గేట్ సెంటర్ వద్ద కూడా కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీల ఏర్పాటు హాట్ టాపిక్‌గా మారింది.

