కలం, నల్లగొండ బ్యూరో: ఆ చిన్నారికి పదేండ్లు.. తన బుడిబుడి అడుగులతో లోకాన్ని చుట్టేయాల్సిన వయసులో విధి ఆడిన వింత నాటకానికి ఒక కాలు కోల్పోయింది. తన బిడ్డ మళ్లీ నడుస్తుందో లేదోనన్న తండ్రి ఆవేదన ఒకవైపు.. రెక్కాడితే గాని డొక్కాడని పేదరికం మరోవైపు.. అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి నల్లగొండ జిల్లా కలెక్టర్ (Nalgonda Collector) బి.చంద్రశేఖర్ (Chandrashekhar) రూపంలో ఒక ఆశాకిరణం కనిపించింది. అధికారం అంటే కేవలం ఆదేశాలు జారీ చేయడం కాదు.. ప్రజల కన్నీళ్లు తుడవడం కూడా.. అని నిరూపిస్తూ ఆ కలెక్టర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఒక చిన్నారి భవిష్యత్తుకు భరోసానిచ్చింది. వివరాల్లోకి వెళ్లే.. కనగల్ మండలం జి.చెన్నారం గ్రామానికి చెందిన చంద్రమౌళి కుమార్తె స్వాతిక (10) గతంలో జరిగిన ఒక ప్రమాదంలో తన కాలును కోల్పోయింది. ఆటపాటలతో గడపాల్సిన వయసులో ఆ చిన్నారి వైకల్యంతో ఇంటికే పరిమితం కావడం ఆ తండ్రిని కలచివేసింది. బుధవారం తన కుమార్తె భవిష్యత్తు కోసం.. తన జీవనోపాధి కోసం కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్ బి.చంద్రశేఖర్ ముందు తన గోడును వెళ్లబోసుకున్నారు.
చంద్రమౌళి విన్నపాన్ని సావధానంగా విన్న కలెక్టర్ చంద్రశేఖర్.. చిన్నారి స్వాతిక పరిస్థితిని చూసి చలించిపోయారు. సాధారణంగా ఇలాంటి వినతులు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల రూపంలో ముందుకు సాగడానికి సమయం పడుతుంది. కానీ, ఇక్కడ కలెక్టర్ సాబ్ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించారు. స్వాతికకు తక్షణమే కృత్రిమ కాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు అంగీకరించారు. ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తండ్రి చంద్రమౌళికి మూడు చక్రాల బండిని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ చంద్రశేఖర్ చొరవతో నేడు స్వాతిక మళ్లీ తన కాళ్ల మీద తాను నిలబడబోతోంది. ఆ చిన్నారి కండ్లలో కనిపించే ఆనందమే జిల్లా యంత్రాంగానికి దక్కే అసలైన గౌరవం.

