కలం, వెబ్‌డెస్క్: ప్రపంచ అథ్లెటిక్స్ రంగంలో కెన్యా రన్నర్ సెబాస్టియన్ సావే రెండు గంటలలోపే మారథాన్‌ను పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, అదే నెలలో ఒక భారతీయ యువకుడు కూడా అసాధారణమైన ఘనత సాధించాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాకు చెందిన 28 ఏళ్ల సావన్ బర్వాల్ (Sawan Barwal) భారత అథ్లెటిక్స్ చరిత్రలో అత్యంత పురాతనమైన 48 ఏళ్ల నాటి జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. నెదర్లాండ్స్‌లో జరిగిన రోటర్‌డ్యామ్ మారథాన్ (Rotterdam Marathon) లో సావన్ బర్వాల్ ఈ అద్భుతాన్ని సాధించాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సావన్‌కు ఇది జీవితంలో మొట్టమొదటి మారథాన్ పోటీ. ముగింపు రేఖకు కేవలం 50 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఆయన స్పృహ తప్పే స్థితికి చేరుకున్నాడని, ప్రాణాలకు తెగించి మరీ పరుగును పూర్తి చేశానని సావన్ తెలిపాడు. శివనాథ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును ఎలాగైనా అధిగమించాలనే లక్ష్యంతోనే తాను ఆ కష్టాన్ని ఓర్చుకున్నట్లు ఆయన పేర్కొన్నాడు.
1978లో శివనాథ్ సింగ్ నెలకొల్పిన సమయం 2:12:00 గా ఉంది. అదే ఇప్పటి వరకు రికార్డ్. కాగా ఇప్పుడు సావన్ బర్వాల్ 2:11:58 సమయంలో ముగించాడు. అంటే కేవలం 2 సెకన్ల తేడాతో రికార్డు బ్రేక్ చేశాడు. సావన్ బర్వాల్ ప్రయాణం హిమాచల్‌లోని జోగిందర్‌నగర్ కొండల్లో ప్రారంభమైంది. తొలుత 5 వేల, 10 వేల మీటర్ల పరుగు పందాల్లో రాణించిన ఆయన, 2019లో స్పోర్ట్స్ కోటా ద్వారా ఆర్మీలో చేరారు. కోచ్ స్కాట్ సైమన్ సలహాతో మారథాన్ వైపు మళ్లిన సావన్, కేవలం ఆరు నెలల ప్రత్యేక శిక్షణతోనే ఈ జాతీయ రికార్డును సాధించడం విశేషం. ప్రస్తుతం తన పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న సావన్, తన తదుపరి లక్ష్యాలను కూడా స్పష్టం చేశాడు. 2026 ఆసియా క్రీడలతో పాటు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో భారతదేశం తరఫున పతకాలు సాధించడమే తన ధ్యేయమని ఆయన తెలిపాడు. సరైన శిక్షణ, వసతులు ఉంటే భారత అథ్లెట్లు భవిష్యత్తులో మారథాన్ విభాగంలో మరిన్ని అద్భుతాలు చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

