మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) విశాఖ పర్యటనకు పోలీసుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే నర్సీపట్నం సహా పలు ప్రాంతాల్లో జరిగే ఈ పర్యటనకు పోలీసులు పలు కండిషన్లు పెట్టారు. రూట్ కూడా మార్చారు. తాము ప్రతిపాదించిన మార్గంలోనే జగన్ పర్యటన నిర్వహించాలని పోలీసులు చెప్పగా అందుకు వైసీపీ అంగీకరించింది. జగన్ పర్యటన రూట్ మార్చడం, సుమారు 18 కండిషన్లు పెట్టడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తోంది. జగన్ పర్యటనను అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే ఇటువంటి అడ్డంకులను కూటమి ప్రభుత్వం సృష్టిస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులను జగన్ కలవకుండా చేయడమే కూటమి లక్ష్యమని ఈ కండిషన్లు చూస్తే అర్థమైపోతోందన్నారు. పర్యటన నేపథ్యంలో భద్రత, రూట్ ఏర్పాట్లపై పోలీసులకు పలుసార్లు విజ్ఞప్తి చేశామని, చివరకు ప్రత్యామ్నాయ రూట్‌ను వాళ్లు ఖరారు చేశారని చెప్పుకొచ్చారు.
YS Jagan పర్యటన ఇలా సాగాలి..
-విశాఖ విమానాశ్రయం నుంచి ఎన్ఏడీ కొత్త రోడ్డు, బాజీ జంక్షన్, గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్, వేపగుంట జంక్షన్ రావాలి.
అక్కడి నుంచి సుజాతనగర్, పెందుర్తి పోలీస్ స్టేషన్ జంక్షన్, పెందుర్తి జంక్షన్, సరిపల్లి జంక్షన్ మీదుగా రోడ్డు మార్గంలో వెళ్లాలి.
ట్రాఫిక్ ఏసీపీ అనుమతి లేకుండా ఈ మార్గం నుంచి ఎటువంటి మార్పులు, పొడిగింపు లేదా అనుమతి లేని హాల్ట్ చేయకూడదు.
ఈ మార్గంలో ఏదైనా జంక్షన్, రోడ్డు పక్కన ఉన్న పాయింట్ లేదా వేదిక వద్ద నిర్వాహకులు ప్రజలను సమీకరించకూడదు. గుమిగూడటానికి కూడా అనుమతి లేదు.
మార్గంమధ్యలో సమావేశాలు, రిసెప్షన్లు, ప్రజల్ని సమీకరించడం చేయకూడదు.
ఊరేగింపులు, రోడ్ మార్చ్‌లపై నిషేధం ఉంటుంది.

