కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో (Huzurabad Government Hospital) రికార్డుల నిర్వహణపై స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే (Ashwini Tanaji Wakade) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఆస్పత్రిలోని వివిధ విభాగాలను అసిస్టెంట్ కలెక్టర్ హరిప్రసాద్‌తో కలిసి ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగం విభాగాలు, ఫైళ్లు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించిన అడిషనల్ కలెక్టర్‌కు పలు అక్రమాలు, పొరపాట్లు దర్శనమివ్వడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్పత్రిలోని స్టోర్ రూమ్ ని పరిశీలించిన సమయంలో వివిధ విభాగాలకు మందులు ఇంకా సరఫరా చేయకుండానే ముందుగానే రిజిస్టర్లలో నమోదు చేస్తుండటాన్ని అశ్విని తానాజీ వాకడే పట్టుకున్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మందులు పంపిణీ చేసిన తర్వాతే రికార్డుల్లో నమోదు చేయాలని, ఇటువంటి బాధ్యతారాహిత్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. అంతేకాకుండా అత్యంత కీలకమైన అనస్థీషియా ఇంజెక్షన్ల వినియోగ రికార్డుల్లో తీవ్ర వ్యత్యాసాలు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
మందులు, ఇంజెక్షన్ల వినియోగానికి సంబంధించి ప్రతి వివరాలు ఎప్పటికప్పుడు పారదర్శకంగా నమోదు చేయాలని ఆదేశించారు. అంతకుముందు ఓపీడీ, గైనకాలజీ, ఫిమేల్ సర్జికల్ క్లినిక్, ఎక్స్‌రే రూమ్, డయాలసిస్ కేంద్రం, అత్యవసర చికిత్స విభాగం తదితర విభాగాలు సందర్శించి సిబ్బంది హాజరును, రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. నేరుగా వార్డుల్లోని రోగులతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న వైద్యంపై ఆరా తీశారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
అనంతరం ఆర్ఎంఓ ఛాంబర్లో డీసీహెచ్ఎస్, ఆస్పత్రి సూపరింటెండెంట్ రవీందర్, వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. “పేద ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులపైనే కొండంత ఆశలు పెట్టుకుని వస్తారు. వారి నమ్మకాన్ని నిలబెట్టేలా బాధ్యతాయుతంగా పనిచేయాలి. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదు” అని స్పష్టం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని, ఆర్డీఓ జలకుమారి, తహసీల్దార్ నరేందర్, ఆస్పత్రి వైద్యులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

