కలం, వెబ్ డెస్క్: ప్రేమ, మమకారం మనుషులపైనే కాదు.. కొన్ని సార్లు వస్తువులపై చూపిస్తారు. ఆ వస్తువు కోసం ఎంత కష్టమైనా, ఖర్చైనా పెట్టేందుకు వెనుకాడరు. అలాంటి అనుబంధమే ఆటోను ఖండాలు దాటించి మరీ ఓ జంట తమ వద్దకు చేర్చుకుంది. ఓ బ్రిటిష్ జంట చెన్నైలో ఎరుపు రంగు ఆటో (Chennai Auto) ను కొనుగోలు చేసి దానికి ‘Timmy the Tin Can’ అని పేరు పెట్టుకుంది. దాదాపు 75 రోజుల పాటు అదే ఆటోలో ఆగ్రా, తాజ్ మహల్, గోవా సహా ఎన్నో పర్యాటక ప్రాంతాల్లో 4,218 కిలోమీటర్లు ప్రయాణించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఆస్వాదించిన జంటకు ఆటోతో మంచి అనుబంధం ఏర్పడింది.
భారత్‌లో పర్యటన ముగించుకుని బ్రిటన్‌కు తిరిగి వెళ్లే సమయంలో ఆ ఆటోను అక్కడే వదిలేయడానికి వారికి మనసొప్పలేదు. ఇన్నాళ్లు తిరిగిన ఆ బుజ్జి ఆటోను తమతోనే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్రత్యేకంగా షిప్పింగ్ కంటైనర్‌లో ఆ టిమ్మీ ఆటోను భారత్ నుంచి బ్రిటన్‌కు పంపించారు. దాదాపు ఆరు నెలల నిరీక్షణ తర్వాత లండన్ పోర్టులో తమ ఆటోను చూసి ఆ జంట ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమ భారత పర్యటనకు మధుర జ్ఞాపకంగా మిగిలిన ఆటోను సముద్రాలు దాటించి మరీ తీసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

