కలం, పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడా రంగంలో నవశకానికి నాంది పలికింది. సైక్లింగ్ క్రీడలో (Cycling Training) అంకితభావంతో ముందుకు సాగుతున్న ప్రముఖ సీనియర్ సైక్లిస్ట్, NIS ధ్రువీకృత కోచ్ బండారి నాగేశ్వర్ రావు (Bandari Nageshwar Rao) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (CFI) నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన క్లాస్–I కోచ్ సర్టిఫికేషన్‌ను ఆయన సాధించి, జిల్లా కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశారు.
జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించిన నాగేశ్వర్ రావును జిల్లా యువజన, క్రీడల అధికారి బి. అనూష శనివారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం వెనుక ఆయన ప్రదర్శించిన క్రమశిక్షణ, నిబద్ధత, నిరంతర శ్రమ ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయన సాధించిన ఈ ఘనత జిల్లా యువ క్రీడాకారులకు గర్వకారణమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో సైక్లింగ్ క్రీడను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, ఔత్సాహిక క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించేందుకు నాగేశ్వర్ రావు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో ఒక స్వతంత్ర సైక్లింగ్ క్లబ్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ వేదిక ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, యువ సైక్లిస్టులకు ప్రాథమిక స్థాయి నుంచి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా మన ప్రాంత క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

