కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాల్లో రెండు లక్షలకు పైగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్టీకి చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు (Poladi Rama Rao) డిమాండ్ చేశారు. ఆర్ధిక పరిస్థితి నెపంతో ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్ నిధుల చెల్లింపులు, కొత్త ఉద్యోగ నియామాకాలను చేపట్టకుండా ఉండేందుకే రిటైర్మెంట్ వయో పరిమితిని పెంచి నిరోద్యోగ సమస్య కు కారణమవుతున్నారని రామారావు మండి పడ్డారు.
ఆదివారం కరీంనగర్ లో ఓ హోటల్ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన రాష్ట్ర, ఉమ్మడి జిల్లాల ప్రజా సంఘాల నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇంటికో ఉద్యోగం నినాదం పేరుతో అధికారంలోకి వచ్చిన గత పాలకుల 10ఏళ్లలో ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం చేసి నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం చేసి వారి అగ్రహానికి పాలకులు మూల్యం చెల్లించుకున్నారని అన్నారు.
యువతకు ఉద్యోగాలు, అన్నదాతలకు అండగా ఉంటామని అధికారం లో కీ వచ్చిన ప్రస్తుత పాలకులు పగ్గాలు చేపట్టి రెండున్నరేళ్లు గడుస్తున్నా కేవలం 26వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారన్నారు. రెండు లక్షలకుపై గా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీలో కుంటి సాకులతో కాల యాపన చేస్తున్నారని విమర్శించారు. ఫీజు రీయంబెర్స్ మెంట్ నిధులను కూడా చెల్లింపులు చేయడం లేదన్నారు. నిరుద్యోగ భృతి హామీని అటకెక్కించారని దుయ్యబట్టారు. అన్నదాతలకు ఇచ్చిన హామీలను విస్మరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో పాలక, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు దిగి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఖాళీగా ఉన్న కోటి 68 లక్షల ఉద్యోగాల భర్తీ లో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి విడనాడి తక్షణమే భర్తీ చేయాలని రామారావు (Poladi Rama Rao) డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుల, నిరుద్యోగుల సమస్యల పరిష్కరించడంలో పాలకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వచ్చే నెలలో హైదరాబాద్ ధర్నా చౌక్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది తో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించుటకు సమావేశంలో తీర్మానించినట్లు సమావేశం అనంతరం మీడియాకు పోలాడి రామారావు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు చందుపట్ల నర్సింహారెడ్డి, తాడి శెట్టి పశుపతి, కొత్త కొండ రవీందర్ రావు, పోరెడ్డి సత్యనారాయణ రెడ్డి, అండెం ప్రభాకర్ రెడ్డి, మహంకాళి రాజన్న, వేముల సుదర్శన్ రెడ్డి, మూగల మహేందర్ రెడ్డి, బోయినపల్లి శ్రీనివాస్ రావు, జంపాల నర్సయ్య, బచ్చు ఆనందం, తదితరులతోపాటు ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Read Also: పగలు తాపీ మేస్త్రీలు.. రాత్రయితే దొంగలు!
Follow Us On: X(Twitter)

