కలం, వరంగల్ బ్యూరో: వాళ్లిద్దరూ అన్నదమ్ములు.. పగలు తాపీ మేస్త్రీ పని చేస్తుంటారు. రాత్రయితే చాలు దొంగల అవతారమెత్తి, రైతుల వస్తువులను దోచుకుంటున్నారు. వరంగల్ (Warangal) జిల్లా మామునూర్ సమీపంలోని అల్లి తిమ్మాపూర్ గ్రామంలో ఆదివారం వెలుగుచూసిన ఘటన ఆశ్చర్యం కలిగిస్తోంది.
రాత్రికి రాత్రే మాయం..
పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం… రొయ్యల రాజేష్, రొయ్యల నరేష్ అన్నదమ్ములు తాపీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పనుల కోసం వెళ్లే సమయంలో ఇళ్లు, వ్యవసాయ బావుల వద్ద ఉండే మోటార్లు, స్టార్టర్లు, విద్యుత్ వైర్లు, పైపులు తదితర వస్తువులను గుర్తించి, రాత్రి సమయాల్లో దొంగిలించడం అలవాటుగా మార్చుకున్నారు.
ఇటీవల పెద్దమ్మ తల్లి బోనాల సందర్భంగా పలువురు రైతులు తమ మోటార్లకు స్టార్టర్లు అమర్చారు. రాత్రికి వాటిలో కొన్ని కనిపించకుండా పోవడంతో గ్రామస్థులకు అనుమానం వచ్చింది.
అనుమానం రావడంతో పరార్..
అప్పటికే గ్రామంలో వరుస చోరీలు జరుగుతుండటంతో రాజేష్, నరేష్‌పై అనుమానం మరింత బలపడింది. దీంతో గ్రామ పెద్దలు వారిని పంచాయతీ కార్యాలయానికి రావాలని పిలిచారు. చోరీ చేసింది తామేనని తెలిసిపోయిందని భావించిన ఇద్దరు పరారయ్యారు. గ్రామస్థులు వారి ఇంటికి వెళ్లి పరిశీలించగా.. అక్కడున్న వాటిని చూసి షాకయ్యారు.
ఇంటి నిండా మోటార్లు, స్టార్టర్లు, విద్యుత్ వైర్లు, కేబుళ్లు, పైపులు, సౌండ్ బాక్సులు, ఇతర విద్యుత్ సామగ్రి కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వస్తువులను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అవన్నీ బాధిత రైతులకు చెందినవేనని నిర్ధారణకు వచ్చారు. రాజేష్, నరేష్‌ల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

