పోచారానికి బుజ్జగింపుల పర్వం.. నిధుల కోసం పట్టు వీడని నేత!

కలం, నిజామాబాద్ బ్యూరో: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas Reddy) వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగానూ మారుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ (Banswada) పరిధిలో నిర్మిస్తున్న సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధుల కోసం ఆయన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. నిధుల విషయమై ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి అసహనం వ్యక్తం చేశారు.

పోచారం ఏమన్నారంటే..

‘అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. ఉంటే అసలు పని చేస్తుందా..? సిద్దాపూర్ రిజర్వాయర్‌కు నిధులు ఇవ్వరా? ముఖ్యమంత్రికి 20సార్లు చెప్పాను. నేనేమీ నిన్నా మొన్నా ఎమ్మెల్యే కాలేదు. సీనియర్ ఎమ్మెల్యేను. ఇరవై ఏళ్లుగా మంత్రిగా పనిచేశా. అర్ధరాత్రి ఫోన్లు వస్తే మాట్లాడేవాడిని. మాజీ స్పీకర్‌ను. మాలాంటి వాళ్లకు రెస్పాండ్ కాకపోతే ఎందుకండీ రాజకీయం. దరిద్రపు రాజకీయం. ఇంత ఘోరమా? నిధుల కోసం కాళ్ళు పట్టుకోవాలా’ అంటూ సీఎంతోపాటు మంత్రులద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యయి. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్ లాంటివారు వివరణ ఇచ్చారు. నిధుల కొరత ఉందని పోచారం లాంటివారు అర్థం చేసుకోవాలని, బీఆర్ఎస్ ఖజానా ఖాళీ చేయడం వల్లేఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు.

ఇరకాటంలో కాంగ్రెస్ పెద్దలు- బుజ్జగింపులు షురూ

పోచారం వ్యాఖ్యలతో కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) ఇరకాటంలో పడ్డట్టు కనిపిస్తోంది. నిధుల విషయంలో సీఎంతోపాటు మంత్రులు ఎమ్మెల్యేల పేర్లు పోచారం ప్రస్తావించడంతో అంతా షాక్ అయ్యారు. పోచారం తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలో కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. రెండోసారి ఏర్పడిన ప్రభుత్వంలో అసెంబ్లీ స్పీకర్‌గా విధులు నిర్వహించారు. మూడోసారి బీఆర్ఎస్ గుర్తుపై పోచారం విజయం సాధించారు. బాన్సువాడ నియోజకవర్గానికి భారీగా నిధులు తెచ్చుకోగలిగారు. అందుకు అప్పటి సీఎం కేసీఆర్ సహకరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా కొనసాగుతున్నారు. అయితే పోచారంకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధుల కొరత రాలేదు. బాన్సువాడలో అభివృద్ధి పనులు స్పీడ్‌గా జరిగాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. కొత్తగా అభివృద్ధి పనులు జరగడం లేదు. పైగాపాత పనులకు కూడా నిధులు రావడం లేదు. ఈ విషయమై జనాల నుంచి విమర్శలు పెరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో పోచారం తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఏదేమైనా ప్రభుత్వంతో తేల్చుకుందాం అన్నట్టుగా భావించినట్టున్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వంతోపాటు సీఎం మంత్రులు ఎమ్మెల్యేల మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రభుత్వ పెద్దలు ఇరకాటంలో పడ్డారు.. కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా పోచారం (Pocharam Srinivas Reddy) అంశం చర్చకొచ్చినట్టు సమాచారం. కొందరు దూతలు పోచారం‌కు టచ్‌లోకి వెళ్లి బుజ్జగించినట్టు సమాచారం. ఈ బుజ్జగింపులతో పోచారం శాంతిస్తారా? మళ్లీ తిరుగుబాటు చేస్తారా? అనేది చర్చనీయాంశమవుతోంది.

Read Also: కేటీఆర్ పాదయాత్ర.. కేసీఆర్ భిన్నాభిప్రాయం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>