కలం, కరీంనగర్ బ్యూరో: డాక్టర్. బాబాసాహేబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక సమానత్వానికి మార్గదర్శిగా నిలిచారని టీఎన్జీవోస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి (Daram Srinivasa Reddy) అభివర్ణించారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లాలోని (Karimnagar) స్థానిక టీఎన్జీవోస్(TNGOs) సంఘ భవనంలో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి టీఎన్జీవోస్ చీఫ్, నాయకులు ఘన నివాళులు అర్పించారు. అలాగే జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమంలో టీఎన్జీవో (TNGO) నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా దారం శ్రీనివాసరెడ్డి (Daram Srinivasa Reddy) మాట్లాడుతూ.. “విద్య, సంఘటితం, ఆందోళన” అనే ఆయన సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు. “నోరులేని మేకలను మాత్రమే బలిచేస్తారు… గర్జించే సింహాలను ఎవరూ బలి ఇవ్వలేరు” అని పేర్కొంటూ, “అజ్ఞానవంతుడు మోసపోతాడు… విజ్ఞానవంతుడు మోసపోడు” అనే సూత్రాన్ని అంబేద్కర్ బలంగా విశ్వసించారని అన్నారు. తాను కూడా అదే మార్గంలో నడవాలని పునరుద్ఘాటించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ చైతన్యంతో, స్వాభిమానంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాగి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, తిమ్మాపూర్ అధ్యక్షులు పోలు కిషన్, జిల్లా నాయకులు గంగారపు రమేష్, శంకర్ యాదవ్, సరిత, శైలజ, అజ్గార్ అలీ, కొండయ్య, అనిల్ కుమార్, సుధాకర్ రెడ్డి, పవన్ కుమార్, కొమ్మేర శ్రీనివాస్ రెడ్డి, కరుణాకర్, ఉద్యోగులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: కేటీఆర్ పాదయాత్ర.. కేసీఆర్ భిన్నాభిప్రాయం
Follow Us On : WhatsApp

