కలం, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉన్నది నిజమేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ (Tirumala Laddu)లో కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి కూటమి ముఖ్య నేతలు నేడు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, మంత్రి నారా లోకేశ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో హిందూమతంపై దాడులు జరిగాయని పవన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలా సుమారు 219 ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. దేవాలయాలను అపవిత్రం చేస్తే ఒక్క ఘటనపైనా చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఈ అంశాలపై రాజకీయ దురుద్దేశంతో స్పందించలేదని చెప్పారు.
వేంకటేశ్వర స్వామికి సంబంధించిన అంశంపై సీఎం చంద్రబాబు సహా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో మాట్లాడారని వ్యాఖ్యానించారు. నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డ్ రిపోర్టులను సీఎం వివరించారని పవన్ తెలిపారు. మూడు రిపోర్టుల్లో ఒక దాంట్లో వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయని తెలిపారు. అసలు నెయ్యి లేదన్నారు. ఒక రిపోర్టులో ఫిష్ ఆయిల్, ఒక దాంట్లో పంది కొవ్వు, ఒక దాంట్లో గొడ్డు కొవ్వు ఉందని చెప్పారు. దీనిపై చాలా ఆలోచించి మాట్లాడామని చెప్పారు. ఈ అంశాలు ప్రజలకు చెప్పకపోతే రేపు మీకు తెలిసినా ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తారని బయటపెట్టామన్నారు. తాము ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నామని, రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. తర్వాత లడ్డూ అంశం సుప్రీం కోర్ట్ వరకు వెళ్లిందని చెప్పారు.
వైసీపీ నేతలు భగవంతుడిపై పగబట్టారని పవన్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. వీరి నేపథ్యం ఏమిటో ప్రజలు గమనించాలని కోరారు. ప్రత్యర్థుల మీద పగ ఉండొచ్చు కానీ, భగవంతుడిపై పగ బట్టినందుకే మేం ఈ విషయాలు మాట్లాడాల్సి వచ్చిందన్నారు. నాడు ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు చాలు అని ఒకరు వ్యాఖ్యానించారని విమర్శలు చేశారు. అయోధ్య రామాలయానికి కూడా లక్ష లడ్డూలు వనస్పతితో చేసి పంపించారన్నారు. రిపోర్టులు వచ్చిన తర్వాత అసలు నెయ్యి వాడలేదని, ప్లాంట్ బేస్డ్ వనరులు, రసాయనాలు వాడారని చెప్పారు. తిరుమల లడ్డూలో నెయ్యిపై సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదని చెప్పారు. ఈ తరుణంలో వైసీపీ వాళ్లు అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోమన్నారు.
ఈ అంశంలో మతానికి చోటు లేదన్నారు. గత ప్రభుత్వంలో ఎవరికి హిందూ ధర్మం అంటే గౌరవం లేదన్నారు. ఇప్పుడు క్షమాపణ చెప్పకుండా మమ్మల్ని క్షమాపణలు చెప్పమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవంతుడి మీద పగ పెట్టుకున్న వాళ్లు నాశనం అవుతారని పవన్ వ్యాఖ్యానించారు. 2022లోనే లడ్డూ కల్తీ జరిగిందని రిపోర్ట్ వచ్చిందని, వైసీపీ దాన్ని తొక్కి పెట్టేసిందని ఆరోపించారు. ఈ అంశాన్ని ఇంతటితో వదిలి పెట్టేది లేదని, దోషులను తప్పకుండా శిక్షిస్తామని వెల్లడించారు.
Read Also: నేడు కూటమి పార్టీల అగ్ర నేతల భేటీ
Follow Us On: Pinterest


