కలం, వెబ్ డెస్క్ : భారత పర్యటనలో ఉన్న నేపాల్‌కు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) చైర్మన్ రబీ లమిచ్ఛానేతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో మైలురాయిగా నిలుస్తుందని ఇరుపక్షాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. పరస్పర సహకారం, ఉమ్మడి ప్రగతి లక్ష్యంగా కలిసి పనిచేసేందుకు లమిచ్ఛానే చూపిన చొరవను ప్రధాని మోదీ స్వాగతించారు.
భారతదేశ విదేశాంగ విధానంలో ‘నేబర్‌హుడ్ ఫస్ట్’ (పొరుగువారికే ప్రథమ ప్రాధాన్యం) పాలసీ కీలకమైనదని, అందులో భాగంగానే నేపాల్‌కు భారత్ ఎల్లప్పుడూ అగ్రతాంబూలం ఇస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. నేపాల్‌లో కొలువుదీరిన నూతన ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు భారత్ ఎంతో ఉత్సాహంగా ఉందన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక, బహుముఖ సంబంధాలను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఈ భాగస్వామ్యం ఎంతగానో దోహదపడుతుందని ప్రధాని అన్నారు. రాబోయే రోజుల్లో ఇరు దేశాల ప్రజల శ్రేయస్సు, ఆర్థికాభివృద్ధి కోసం ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను బలపరుస్తూ, పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ సమావేశం ఎంతగానో దోహదపడుతుందని ఇరు దేశాల ప్రతినిధులు భావిస్తున్నారు.

