కలం, తెలంగాణ బ్యూరో: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill) క్రెడిట్ ఎవరిదనే చర్చల నేపథ్యంలో ‘ఆ క్రెడిట్ నాకొద్దు..’ అంటూ స్వయంగా ప్రధాని మోడీ (PM Modi) లోక్‌సభ వేదికగా వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో దేశ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు ఇది అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్ల సంగతి ఎలా ఉన్నా తాజా మహిళా చట్టంతో బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS), మజ్లిస్ (AIMIM) పార్టీల మైండ్‌సెట్ మారుతుందా? మహిళలకు ప్రాధాన్యత ఇస్తాయా? అనే సెటైర్లు వినిపిస్తున్నాయి. మహిళల రాజకీయ సాధికారత కోసమే ఈ చట్టాన్ని తెచ్చామని చెప్తున్న బీజేపీ రానున్న రోజుల్లో పార్టీలో సంస్థాగతమైన వ్యవహారాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందా? మొదటిసారి క్యాబినెట్‌లో ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించని బీఆర్ఎస్ ఇకనైనా ధోరణిని మార్చుకుంటుందా? ఇప్పటివరకు లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కసారి కూడా మహిళకు టికెట్ ఇవ్వని మజ్లిస్ పార్టీ తన ఆలోచనను మార్చుకోక తప్పదా?.. ఇలాంటివన్నీ ఇప్పుడు పబ్లిక్‌లో జనరల్ టాపిక్‌గా మారాయి.
బీఆర్ఎస్‌పై ఇప్పటికీ మహిళా వివక్ష విమర్శ :
మహిళలకు తగిన అవకాశాలు ఇవ్వడంలేదని బీఆర్ఎస్ (BRS)పై ఒక సాధారణ విమర్శ ఉన్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఆ టర్ములో క్యాబినెట్‌లో ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించలేదన్న విమర్శ ఇప్పటికీ వెంటాడుతున్నది. మహిళలను పార్టీలో ఎదిగేలా అవకాశాలు ఇవ్వలేదన్నది మరో ఆరోపణ. ఇవేవీ చాలదన్నట్లుగా కల్వకుంట్ల కవిత వ్యవహారం ఇప్పటికీ ఆ పార్టీకి మచ్చగానే మారింది. పార్టీలో నాయకత్వానికి ఎదగడాన్ని జీర్ణించుకోలేకనే తనను పక్కన పెట్టారని, మహిళ అయినందునే వివక్ష చూపారని స్వయంగా కవిత ఆరోపించారు. పార్టీ యాక్టివిటీస్‌లో పాలుపంచుకోకుండా దూరం చేశారని కూడా ఆరోపించారు. వీటిని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు. ‘సొంత చెల్లెలినే పట్టించుకోనోడు..’ అంటూ కేటీఆర్‌ను టార్గెట్ చేశారు. ఇప్పుడు మహిళా చట్టంతో ఆ పార్టీలో ఎలాంటి మార్పులు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
ఒక్కసారి కూడా టికెట్ ఇవ్వని మజ్లిస్ :
తెలంగాణలో మొదలై పలు రాష్ట్రాలకు విస్తరించిన ఆల్ ఇండియా మజ్లిస్ (AIMIM) పార్టీ ఇప్పటివరకు లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడా మహిళకు టికెట్ ఇవ్వలేదనే విమర్శను ఎదుర్కొంటున్నది. అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో టికెట్లు ఇచ్చినా లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం అలాంటి ఆలోచనే చేయలేదన్న అపవాదు వెంటాడుతున్నది. గతంలో మహిళా బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడు కోటాలో సబ్ కోటా ముస్లిం బీసీకి ఇవ్వాలని షరతు పెట్టి చివరకు ఆ బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీపై విమర్శ ఉన్నది. ఇప్పుడు రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు 26కు పెరుగుతున్నందున, శాసనసభ స్థానాలు సైతం 119 నుంచి 182కు చేరుకుంటున్నందున ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు సహా భైంసా లాంటి పట్టున్న నియోజకవర్గాల్లో మహిళలకు మజ్లిస్ పార్టీ ఏ మేరకు టికెట్లు ఇస్తుందన్న చర్చ మొదలైంది. రానున్న రోజుల్లో ఆ పార్టీ వైఖరి వెల్లడి కానున్నది.
పార్టీ వ్యవహారాల్లో మహిళలకు లేని ప్రాధాన్యత :
మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Bill) క్రెడిట్ గురించి మాట్లాడుతున్న ప్రధాని సహా పలువురు బీజేపీ (BJP) నేతలు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో మాత్రం వారికి ప్రాధాన్యత ఇవ్వడంలేదనే విమర్శను మూటగట్టుకున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ పుట్టి 46 ఏండ్లు అవుతున్నా ఇప్పటికీ ఆ పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని మహిళలకు ఇవ్వలేదని గుర్తుచేశారు. కనీసం రాష్ట్ర స్థాయిలోనైనా పార్టీ కీలక బాధ్యతలను అప్పగిస్తారా అనే సాధారణ చర్చ మొదలైంది. ఆ పార్టీకి సంబంధించిన సంస్థాగత అంశాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించడంతో ఇప్పుడు మహిళా రిజర్వేషన్ చట్టం వెలుగులో ఇకపైన బీజేపీ ఎలా వ్యవహరిస్తుంది.. ఇంతకాలం అమలైన ప్రాక్టీసుకు భిన్నంగా మహిళలకు బాధ్యతలు అప్పగిస్తుందా.. ఇలాంటివన్నీ తెరమీదకు వస్తున్నాయి. విమర్శలకు తావులేని తీరులో ధోరణిని మార్చుకుంటుందా అనేది కీలకం.
Read Also: ‘నామ్ కే వాస్తే’గా డీలిమిటేషన్ కమిషన్.. సీట్ల పెంపు ఆల్రెడీ ఖరారు
Follow Us On : WhatsApp

