కలం, వెబ్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ (PM Modi) అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ నెల 26 నుంచి 28 వరకు ఢిల్లీలో ఈ మీటింగ్‌లు జరగబోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మెరుగుపరచడం, కేంద్ర పథకాలు, కార్యక్రమాలు జనంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంలో ప్రతి ఏడు ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు జరగబోతున్నది. మూడురోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించే దిశగా చేయబోయే పరిపాలనా సంస్కరణలపై PM Modi చర్చించబోతున్నారు. కేంద్ర అభివృద్ధి కార్యక్రమాల అమలుపై కూడా ప్రధాన కార్యదర్శులకు ప్రధాని దిశా నిర్దేశం చేయబోతున్నారు. కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు చెప్పారు.
రాష్ట్రాల సమస్యలపై చర్చ
ఈ సదస్సులో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల (యూటీలు) ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా ఉన్న సమస్యలను ఈ సమావేశాల్లో చర్చించబోతున్నారు. గత కొన్ని నెలలుగా 150కిపైగా వర్చువల్, ప్రత్యక్ష వర్క్‌షాపులు నిర్వహించి వివిధ రాష్ట్రాల్లో ఉన్న సమస్యల గురించి తెలుసుకున్నామని పీఎంవో అధికారులు తెలిపారు. ‘వికసిత్ భారత్ కోసం మానవ వనరుల వినియోగం’ అనే థీమ్‌పై 2025 సదస్సు జరగబోతున్నది. దేశంలోని జనాభా సామర్థ్యాన్ని వినియోగించి ఆర్థిక, సామాజిక పురోగతిని సాధించాలన్నదే ప్రధాని ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు చెబుతున్నారు. పాఠశాల విద్య, ఆరోగ్యం–సంక్షేమం, ఆర్థిక హబ్‌లు, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలపై కూలంకుషంగా చర్చించబోతున్నారు. విద్యావ్యవస్థను ఎలా బలోపేతం చేయాలి. మెరుగైన ఫలితాలు ఎలా రాబట్టాలి? అన్న అంశాలు కూడా చర్చకు రాబోతున్నాయి.
గ్రామీణ వైద్య సేవలపై ..
గ్రామీణస్థాయిలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయా? ప్రజలకు నాణ్యమైన వైద్యం అందబోతున్నదా? అన్న అంశాలపై కూడా చర్చించనున్నారు. నగరాలను అభివృద్ధి కేంద్రాలుగా ఎలా తీర్చి దిద్దాలి? కృత్రిమ మేధ సహా సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని మెరుగైన సేవలు ఎలా అందించాలి? అన్న అంశంపై చర్చించబోతున్నారు. జూన్ 2022లో ధర్మశాలలో ప్రారంభమైన ప్రధాన కార్యదర్శుల సదస్సు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ అధికారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, విడివిడిగా పనిచేసే విధానానికి ముగింపు పలికి సమగ్ర జాతీయ దృక్పథంతో ముందుకు సాగడమే లక్ష్యంగా కొనసాగుతోంది.


