నోట్ల రద్దు, కరోనా తర్వాత.. మరోసారి మోదీ కీలక స్టెప్..!

కలం, నేషనల్ బ్యూరో : దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని మోడీ (PM Modi) కీలక నిర్ణయాలు తీసుకోనున్నారా?.. నేరుగా ప్రజలకు సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారా?… జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారా?.. పెద్ద నోట్ల రద్దు, కరోనా లాక్‌డౌన్ లాంటి సందర్భాల్లో టీవీల ద్వారా మెసేజ్ ఇచ్చిన ప్రధాని మరోసారి ప్రజలకు మెసేజ్ ఇవ్వదల్చుకున్నారా?.. ఇలాంటి ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వవర్గాలు ‘ఔను’ అనే సమాధానాన్ని ఇస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా దాడులు జరిపిన అనంతరం నెలకొన్న పరిస్థితులను వివరించనున్నట్లు సమాచారం. దేశంపై పడిన ప్రభావాన్ని, రానున్న రోజుల్లో తలెత్తే పరిస్థితులను వివరించే అవకాశమున్నది. జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి ముందస్తు సంకేతంగానే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారన్నది ఆ వర్గాల అభిప్రాయం. టీవీల ద్వారా మెసేజ్ ఇవ్వడానికి ప్రధాని మోడీ ముహూర్తాన్ని ఎప్పుడు ఫిక్స్ చేస్తారన్నది సస్పెన్స్.

పెద్ద నోట్ల రద్దుతో ప్రధాని సంచలనం :

దేశ ప్రధానిగా మోడీ (PM Modi) బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి 2016 నవంబరు 8న పెద్ద నోట్లను (రూ. 1000, రూ. 500) రద్దు చేస్తున్నట్లు టీవీల ద్వారా జాతికి మెసేజ్ ఇచ్చారు. హఠాత్తుగా సంచలన నిర్ణయం తీసుకోవడంతో యావత్తు దేశం దిగ్భ్రాంతికి గురైంది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 పరిస్థితుల్లో జనతా కర్ఫ్యూ (మార్చి 19, 2020న), దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ (మార్చి 24, 2020) విధిస్తున్నట్లు టీవీ ప్రసంగం ద్వారా జాతికి సమాచారం ఇచ్చారు. మధ్యలో అంతరిక్ష రంగంలో ‘మిషన్ శక్తి’ ద్వారా భారత్ సూపర్ పవర్‌గా ఆవిర్భవించిందని, జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకంగా ఇంతకాలం అమలైన ఆర్టికల్ 370ని రద్దు చేశామని 2019 మార్చి, ఆగస్టు మాసాల్లో టీవీల ద్వారానే జాతికి సందేశం ఇచ్చారు. కరోనా పరిస్థితుల కారణంగా సగటు పౌరుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 2020 మే 12న ‘ఆత్మనిర్భర్ భారత్’ కింద రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు.

గతేడాది ఆపరేషన్ సిందూర్ సందేశం :

పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి అనంతరం భారత్-పాక్ మధ్య ఘర్షణల నేపథ్యంలో ‘ఆపరేషన్ సిందూర్’ అంశాన్ని గతేడాది మే నెలలో జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. దానికి ముందు రైతుల ఆందోళన కారణంగా మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు 2021 నవంబరు నెలలో టీవీల ద్వారా చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ముడిచమురు కొరత, ఎల్పీజీ సిలిండర్ల సంక్షోభం, సాగు సీజన్ సమీపిస్తున్న తరుణంలో తలెత్తిన యూరియా ఇబ్బందులు, ఇరాన్ యుద్ధ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో తెలియని అనిశ్చితి.. వీటన్నింటి కారణంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి ప్రధాని మోడీ సిద్ధమవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. ఏయే అంశాలను ప్రస్తావించి ఎలాంటి ప్రకటన చేస్తారన్నది ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. జాగ్రత్తలు సూచిస్తారా?.. లేక బాంబు లాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారా?.. లేక ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా కల్పిస్తారా?.. లేక చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణలు, డీ లిమిటేషన్ లాంటి అంశాలను ప్రస్తావిస్తారా?.. సస్పెన్స్ నెలకొన్నది.

Read Also: మతం అడిగి రైడ్ క్యాన్సిల్: రాపిడో డ్రైవర్ తీరు వివాదాస్పదం !

Follow Us On : WhatsApp

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>