కలం, స్పోర్ట్స్: భారత బ్యాడ్మింటన్ యువతార ఆశ్మిత చలిహా కొరియా మాస్టర్స్(Korea Masters 2026) సూపర్-300 టోర్నీలో ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో స్వదేశీ క్రీడాకారిణి రక్షిత శ్రీను పై 21-13, 16-21, 21-13 తేడాతో విజయం సాధించింది. తొలి గేమ్‌లోనే ఆశ్మిత ఆధిపత్యం ప్రదర్శించింది. 21-13తో గేమ్‌ను సొంతం చేసుకుంది. అయితే రెండో గేమ్‌లో రక్షిత పుంజుకుంది. వరుస పాయింట్లు సాధిస్తూ 21-16తో గేమ్ గెలిచి మ్యాచ్‌ను సమం చేసింది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఆశ్మిత మరోసారి తన దూకుడు పెంచింది. వరుస పాయింట్లతో ఆధిపత్యం సాధించి 21-13తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంది. దీంతో కొరియా మాస్టర్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఫైనల్లో చైనా క్రీడాకారిణితో పోరు
ఫైనల్లో చైనాకు చెందిన హాన్ కియాన్సీతో ఆశ్మిత తలపడనుంది. అంతకుముందు క్వార్టర్‌ఫైనల్లో జపాన్ టాప్‌సీడ్ హినా అకేచిని 20-22, 21-15, 21-19తో ఓడించి ఆశ్మిత సెమీఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు రక్షిత శ్రీను క్వార్టర్‌ఫైనల్లో తాన్వీ శర్మపై 18-21, 21-19, 21-18తో విజయం సాధించి సెమీస్‌కు వచ్చింది. క్వార్టర్స్ అనంతరం భారత్ తరఫున ఆశ్మిత, రక్షిత మాత్రమే టోర్నీలో మిగిలారు. ఇద్దరూ తమ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌ల్లో గంటకు పైగా పోరాడారు.
పురుషుల డబుల్స్‌లో భారత్‌కు నిరాశ
పురుషుల డబుల్స్‌లో పృథ్వీ కే రాయ్, కృష్ణ ప్రసాద్ జోడీకి సెమీఫైనల్ చేరే అవకాశం దక్కలేదు. మలేషియాకు చెందిన మాన్ వీ చోంగ్, సో వూయి యిక్ జోడీ చేతిలో 21-7, 21-8తో ఓటమి పాలైంది. కొరియా మాస్టర్స్ టోర్నీ ఆదివారంతో ముగియనుంది. మొత్తం 2.5 లక్షల అమెరికన్ డాలర్ల ప్రైజ్‌మనీతో ఈ టోర్నీ జరుగుతోంది. 2007లో ఇంటర్నేషనల్ ఛాలెంజ్ స్థాయిలో ప్రారంభమైన ఈ టోర్నీ 2011లో గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్‌గా మారింది. 2017 తర్వాత బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లోని సూపర్-300 టోర్నీలలో భాగంగా కొనసాగుతోంది.

