కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పాలమూరు జిల్లాలోనే అత్యంత వెనుకబడిన నారాయణపేట జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగానే ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) హైదరాబాద్ నుండి వర్చువల్ గా మహబూబ్ నగర్ (Mahabubnagar) నుండి కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని గూడేబల్లూరు వరకు ఎన్ హెచ్ 167ను విస్తరించేందుకు శంకుస్థాపన చేశారు. పీఎం గతి శక్తి పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఈ జాతీయ రహదారి వెంట మూడు ఎకనామిక్ నోడ్స్, 7 లాజిస్టిక్స్ నోడ్స్, తొమ్మిది సామాజిక నోడ్స్ ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫార్మాసిటీలు, మెడికల్ క్లస్టర్లతో పాటు హైదరాబాద్-బెంగళూరు రహదారి వెంట ఇండస్ట్రియల్ కారిడార్‌కు దీన్ని అనుసంధానం చేయనున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ నుండి జడ్చర్ల మార్గంలోని కొత్తూరు, షాద్ నగర్, జడ్చర్ల పారిశ్రామిక వాడను నిర్మించారు. ప్రస్తుతం హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిలో భాగంగా జడ్చర్ల వరకు నాలుగు వరుసల రహదారి ఉంది. త్వరలో దీన్ని ఆరు వరుసల రహదారిగా నిర్మించనున్నారు. మహబూబ్ నగర్ నుంచి గూడేబల్లూర్ వరకు మాత్రం ప్రస్తుతం రెండు వరుసల రహదారి మాత్రమే ఉంది. అయితే పీఎం గతి శక్తి పథకంలో భాగంగా నాలుగు వరుసల రహదారి నిర్మించనున్నారు. మహబూబ్ నగర్ నుంచి దేవరకద్ర, మరికల్, మక్తల్, మాగనూరు మీదుగా కర్ణాటక సరిహద్దులోని గూడేబల్లూరు వరకు ఎకనామిక్ కారిడార్ అభివృద్ధిలో భాగంగా 80 కిలో మీటర్ల మేర విస్తరణ పనులు చేయనున్నారు. ఈ పనులకు గాను రూ.3,180 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ రహదారి విస్తరణతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.

