లక్నోతో మ్యాచ్.. ధోనీ ఆడతారా? అనిల్ కుంబ్లే ఏమన్నారంటే!

కలం, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌లో MS ధోనీ (Dhoni) ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా, మైదానంలోకి ఎప్పుడు అడుగు పెడతాడా అని అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రతిసారి అదిగో.. ఇదిగో.. ఈ మ్యాచ్‌లో ధోనీ రీఎంట్రీ ఉంటుందన్న వార్తలే తప్ప.. ఎక్కడా ధోనీ కనిపించడం లేదు. ఆయన ఫిట్‌గా ఉన్నారని అంతా చెప్తున్నారు కానీ, మ్యాచ్‌లలో ఎందుకు ఆడటం లేదు అనేది మాత్రం ఎవరూ చెప్పడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఇప్పుడు ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) జట్ల మధ్య రసవత్తర పోరులో ధోనీ ఆడతాడా? అన్నది మరోసారి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ అంశంపై టీమిండియా మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లే (Anil Kumble) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనీ ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించడం కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. సాధారణంగా నెట్స్‌లో వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేయని ధోనీ, ఇప్పుడు కీపింగ్ డ్రిల్స్‌లో కూడా పాల్గొనడం ఆశ్చర్యం కలిగిస్తోందని కుంబ్లే పేర్కొన్నారు. ధోనీ ఎంత ప్రయత్నించినప్పటికీ, ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రావడం అనుమానమేనని కుంబ్లే అభిప్రాయపడ్డారు.

చెన్నై జట్టు గెలుపు జోరులో ఉన్నప్పుడు అనవసర మార్పులు చేయడానికి ఇష్టపడదని, జట్టు కూర్పును దెబ్బతీయడం ధోనీకి కూడా ఇష్టం ఉండదని ఆయన వివరించారు. ప్రస్తుతం ఉన్న కాంబినేషన్ విజయవంతంగా కొనసాగుతున్నందున, ధోనీ జట్టులోకి వచ్చే అవకాశం తక్కువని కుంబ్లే విశ్లేషించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు చెన్నై జట్టు 10 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ముంబై, ఢిల్లీ జట్లపై డబుల్ విజయాలు సాధించడంతో పాటు కోల్‌కతాపై కూడా గెలిచింది. ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపడాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో చెన్నై కచ్చితంగా గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లక్నోతో జరిగే మ్యాచ్ జట్టుకు చాలా కీలకం కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>