కలం, నాగర్ కర్నూల్: జిల్లాలో నిబంధనల ఉల్లంఘన, అధికార దుర్వినియోగం, ప్రభుత్వ నిధుల వినియోగంలో అవకతవకలకు సంబంధించి పలువురు ప్రజాప్రతినిధులపై జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. కొల్లాపూర్, పెంట్లవెల్లి, బిజినపల్లి మండలాల పరిధిలోని మూడు గ్రామాల సర్పంచుల చెక్ పవర్‌ను నిషేధిస్తూ, కోడేరు మండలం ఎత్తం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్‌లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ (Nagarkurnool Collector) ఉత్తర్వులు జారీ చేశారు.
కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి, పెంట్లవెల్లి మండలం పెంట్లవెల్లి, బిజినపల్లి మండలం కారుకొండ గ్రామాల సర్పంచులు గతంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేసినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా తమకు అప్పగించిన అధికారాలను దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణకు రావడంతో ఆయా గ్రామాల సర్పంచుల చెక్ పవర్‌ను నిషేధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు తెలిపారు.
కోడేరు మండలం ఎత్తం గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంకు సంబంధించిన ఫిర్యాదులపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారు సమర్పించిన వివరణలను అధికారులు పరిశీలించిన అనంతరం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు గుర్తించి ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు వెల్లడించారు.
గ్రామపంచాయతీలకు ప్రభుత్వం కేటాయించే నిధులను నిబంధనలకు అనుగుణంగా వినియోగించాలని జిల్లా పంచాయతీ అధికారి సూచించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రజాప్రతినిధులు తమకు అప్పగించిన బాధ్యతలను నిబంధనల మేరకు నిర్వర్తించాలని, ప్రభుత్వ నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

