కలం, జనగామ: కేంద్ర ప్రభుత్వ పథకాలు గత పదేళ్లుగా తెలంగాణలో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదని, ఇకపై అలా జరగకుండా అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని వరంగల్ ఎంపీ, దిశా కమిటీ చైర్పర్సన్ డా. కడియం కావ్య (MP Kadiyam Kavya) అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జనగామ కలెక్టరేట్లో నిర్వహించిన దిశా కమిటీ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు, జిల్లాలో అభివృద్ధి పనులపై సమీక్షించారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, పారక్వాట్ గడ్డి మందు వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కావ్య ఆదేశించారు. పశుసంవర్థక, మత్స్య రంగాలను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు పెంచాలని సూచించారు.
విద్య, వైద్య రంగాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అన్ని పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థుల్లో మానసిక సమస్యలు, రక్తహీనతను పాఠశాల, అంగన్వాడీ స్థాయిలోనే గుర్తించి అవసరమైన చికిత్స, శిక్షణ, పోషకాహారం అందించాలని సూచించారు. మాదకద్రవ్యాల నియంత్రణ, గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. జాతీయ రహదారి–163పై మిస్సింగ్ సర్వీస్ రోడ్ల పనులు, రాఘవాపురం వద్ద వర్షపు నీటి సమస్య, చాగల్, ఘన్పూర్, పెద్దపెండ్యాల వద్ద సైడ్ డివైడర్ల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జనగామ పట్టణ మురుగునీరు నెల్లుట్ల చెరువులోకి చేరకుండా చర్యలు తీసుకుని ఎస్టీపీ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కడియం శ్రీహరి సూచించారు.
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా విద్య, ప్రజా సంక్షేమం కోసం తీసుకుంటున్న ప్రత్యేక చొరవను ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభినందించారు. ప్రజలకు మరింత చేరువయ్యే వినూత్న కార్యక్రమాలు చేపట్టి, వాటి ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో అందేలా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.

