కలం, నిజామాబాద్ బ్యూరో: నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి చెందిన డివిజన్ కమిటీ సభ్యురాలు (DCM), ఛత్తీస్‌గఢ్ మాడ్ డివీసీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కమిటీ (EDC) సభ్యురాలు నక్కా సుశీల రాణి అలియాస్ లత, లలిత, రేలా, జ్యోతి, మాధవి, శ్వేత మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. నిజామాబాద్ పోలీసుల సమక్షంలో ఆమె లొంగిపోయారు. ప్రస్తుతం 57 ఏళ్ల వయసున్న సుశీల రాణి నిజామాబాద్ (Nizamabad) జిల్లా బోధన్‌లోని శక్కర్‌నగర్‌కు చెందినవారు. ఆమె తండ్రి రామకృష్ణ నిజాం షుగర్ ఫ్యాక్టరీలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేశారు. 2005 అక్టోబర్‌లో గుండెపోటుతో ఆయన మృతి చెందారు. సుశీలకు ఏడేళ్ల వయసులోనే ఆమె తల్లి కమల అనారోగ్యంతో 1976లో మృతి చెందారు.
1985లో హైదరాబాద్‌లోని నారాయణగూడకు వెళ్లిన సుశీల రాణి మాడపాటి హనుమంతరావు బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. అనంతరం 1985 నుంచి 1987 వరకు ఇంటర్మీడియట్, 1987 నుంచి 1990 వరకు నాంపల్లిలోని వనిత జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదివారు. 1990 నుంచి 1992 వరకు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ (పైలాన్)లోని ప్రభుత్వ బి.ఎడ్. కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. అయితే ఫైనల్ పరీక్షలకు హాజరు కాలేదు.
1992లో పీపుల్స్ వార్‌లో చేరిక
హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్న సమయంలో బంధువు సురేంద్ర ద్వారా అప్పటి CPI (ML) పీపుల్స్ వార్ సెంట్రల్ ఆర్గనైజర్‌గా ఉన్న రామ్మోహన్ రావుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులై 1990 జూలైలో రామ్మోహన్ రావును వివాహం చేసుకున్నారు. అనంతరం 1992 ఫిబ్రవరిలో CPI (ML) పీపుల్స్ వార్‌లో చేరినట్లు పోలీసులు వెల్లడించారు. 1992 నుంచి 1995 వరకు హైదరాబాద్ సిటీ కమిటీ సాంకేతిక విభాగంలో సెంట్రల్ ఆర్గనైజర్‌గా పనిచేశారు. 1995 డిసెంబర్‌లో నల్గొండ జిల్లా కమిటీ పరిధిలోని కనగల్ ప్రాంతంలోని కృష్ణపట్టి దళానికి బదిలీ అయ్యారు. 1996 జూన్‌లో ఏరియా కమిటీ సభ్యురాలిగా (ACM) పదోన్నతి పొందారు.
1996 డిసెంబర్‌లో చెన్నైలోని ‘క్రాంతి ప్రెస్’ బృందానికి బదిలీ కాగా, 1998 జనవరి వరకు అక్కడ పనిచేశారు. అనంతరం తిరిగి కృష్ణపట్టి దళంలో చేరారు. 1999 మేలో కర్నూలు పట్టణానికి సెంట్రల్ ఆర్గనైజర్‌గా బదిలీ అయి 2001 జూన్ వరకు అక్కడ పనిచేశారు. 2001 జూలైలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ (APSC)లోని ఉపాధ్యాయుల బృందానికి బదిలీ అయ్యారు. APSC మొబైల్ అకడమిక్ స్కూల్ (MAS) ఇన్‌చార్జ్‌గా, మొబైల్ పొలిటికల్ స్కూల్ (MoPOS) సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు. 2002 ఫిబ్రవరిలో DCM స్థాయికి పదోన్నతి పొందారు.2004 ఏప్రిల్‌లో ఆంధ్ర–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ (AOB-SZC)కి బదిలీ అయి MAS, MoPOS బృందాల్లో పనిచేశారు. 2005 మార్చిలో ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోని MoPOS బృందంలో చేరారు.
మాడ్ డీవీసీలో కీలక బాధ్యతలు
2009లో ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కమిటీ (EDC) ఏర్పాటు చేసిన సమయంలో అందులో సభ్యురాలిగా కొనసాగారు. 2011లో బేసిక్ కమ్యూనిస్ట్ ట్రైనింగ్ స్కూల్ (BCTS)కు బదిలీ అయి ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2012 జూన్‌లో PLGA బెటాలియన్-2 క్యాడర్లకు రాజకీయ తరగతులు నిర్వహించేందుకు అక్కడికి బదిలీ అయ్యారు. ఆ బెటాలియన్ రద్దయ్యే వరకు 2014 వరకు ఆమె అక్కడ పనిచేశారు. 2014లో మాడ్ DVCకి బదిలీ అయి 2025 జనవరి వరకు అక్కడ కొనసాగారు. పోలీసు దాడులు తీవ్రతరం కావడంతో 2025 మార్చిలో ఆమెను పట్టణ ప్రాంతానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
మావోయిస్టులకు ఎదురుదెబ్బ: సీపీ
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఎదుట నక్కా సుశీల రాణి లొంగిపోయారు. ఆమె లొంగుబాటు సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఆమె వంటి కీలక సభ్యురాలు జనజీవన స్రవంతిలోకి రావడం ద్వారా మావోయిస్టు పార్టీ పునర్నిర్మాణ అవకాశాలకు కూడా నష్టం కలిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

