కలం, జోగులాంబ గద్వాల: ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్నందున రైతులు ఆరు తడి పంటలు సాగు చేయాలని జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఆయిల్ పామ్ వంటి పంటల సాగుతో అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు. కందులు, మిర్చి, మొక్కజొన్న, పెసర్లు మినుములు, కూరగాయలు, తదితర పంటలు కూడా వేసుకోవచ్చన్నారు.
కందులు, మినుముల విత్తనాలు రాయితీకే లభిస్తున్నందున జిల్లా రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వరి పంటకు నాలుగు నెలల పాటు మడుల్లో నిత్యం రెండు ఇంచుల నీళ్లు నిలువ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో పండించుకునే పంటలే సాగు చేసుకోవడం శ్రేయస్కరమని తెలిపారు.
పందిరి సాగుకు ప్రోత్సాహం..
ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పందిరి కూరగాయల సాగుకు పందిరి నిర్మించుకునేందుకు ఒక్కో రైతుకు రెండున్నర ఎకరాల వరకు ఐదు యూనిట్ల చొప్పున, యూనిట్‌కు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం అందిస్తోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వివరించారు. ఆయిల్ పామ్ మొక్కల మధ్యన అంతర పంటలుగా పప్పు దినుసులు, కూరగాయలు వంటి స్వల్ప కాలిక పంటలతోనూ లబ్ధి పొందవచ్చన్నారు. ఆయిల్ పామ్ తోటల సాగుకు ప్రభుత్వం రైతులకు సబ్సిడీకి మొక్కలను అందజేయడంతో పాటు బిందు సేద్య పరికరాలను కూడా ఇస్తోందన్నారు.
రిజర్వాయర్లు, చెరువులు నింపేందుకే ప్రాధాన్యం..
జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న జలాశయాల నుంచి వస్తున్న వరదను జిల్లాలో ఉన్న రిజర్వాయర్లు, చెరువులకు మళ్లించి తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ చెప్పారు. జూరాల ప్రధాన కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసినా.. వరద తగ్గుముఖం పడితే కాలువలకు నీటి సరఫరా నిలిపి వేస్తామన్నారను. ఖరీఫ్ సీజన్ మొత్తం కాలువల ద్వారా నీటి విడుదల చేసే విషయంపై స్పష్టత లేదన్నారు. వచ్చే వేసవి ముగిసే వరకు ప్రజల తాగు నీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యతనిస్తూ వరద నీటితో ఎత్తిపోతల పథకాల ద్వారా జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలను నింపుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.

