కలం, స్పోర్ట్స్ : టీమిండియాను వరుస గాయాలు కలవరపెడుతున్నాయి. అనేకమంది ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో బీసీసీఐ (BCCI) సీరియస్‌గా స్పందించింది. ఆటగాళ్ల ఫిట్‌నెస్, కోలుకుంటున్న తీరుపై చర్చించేందుకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఆదివారం బెంగళూరుకు వెళ్లనున్నారు. అక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) హెడ్ వివిఎస్ లక్ష్మణ్‌తో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుతం భారత్ పలువురు కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోయింది. మోకాళ్ల వాపుతో జస్ప్రీత్ బుమ్రా, ఎడమ కాలి బొటనవేలి గాయంతో బి.సాయి సుదర్శన్ దూరమయ్యారు.
అలాగే హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి తొడ కండరాల గాయాలతోనూ, వాషింగ్టన్ సుందర్ క్వాడ్రిసెప్స్ గాయంతోనూ బాధపడుతున్నారు. ఆకాష్ దీప్ వెన్నునొప్పి కారణంగా సుదీర్ఘకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్ కూడా సీఓఈలోనే కోలుకుంటున్నారు. మరోవైపు, నితిన్ పటేల్ రాజీనామా చేసిన తర్వాత స్పోర్ట్స్ సైన్స్ విభాగానికి శాశ్వత హెడ్ లేకపోవడంతో అక్కడి వైద్య బృందంపై తీవ్ర పనిభారం పడుతోంది.
ఆటగాళ్ల గాయాల నిర్వహణ, వారు కోలుకునే సమయం విషయంలో సీఓఈకి, సెలక్షన్ కమిటీకి మధ్య సరైన సమన్వయం లేదనే వార్తలు వస్తున్నాయి. హర్షిత్ రాణా విపరీతమైన బరువుతో ఇంగ్లాండ్ చేరడంపై సెలెక్టర్లు అసంతృప్తిగా ఉన్నారు. బుమ్రా, సాయి సుదర్శన్ కనీసం ఒక టెస్టుకైనా అందుబాటులో ఉంటారని భావించినా, వారి గాయాలు మానడానికి మరికొంత సమయం పడుతుందని తేలింది. బుమ్రా మోకాలిలో నీరు చేరడం, సాయి సుదర్శన్‌కు నొప్పులు తగ్గకపోవడం, నితీష్ రెడ్డి బౌలింగ్ వేగం పెంచే క్రమంలో గాయపడటం బోర్డును ఆందోళనకు గురిచేసింది.
ఈ అంశాలన్నింటిపై లక్ష్మణ్‌తో సైకియా సమగ్రంగా చర్చించనున్నారు. ఈ భేటీలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆన్‌లైన్ ద్వారా పాల్గొనే అవకాశం ఉంది. జాతీయ జట్టుకు ఆటగాళ్లు త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూడటమే కాకుండా, ఫిట్‌నెస్ నిర్వహణలో లోపాలను సరిదిద్దడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. అన్ని కోణాల్లో సమన్వయాన్ని పెంచి, ఆటగాళ్లను సమర్థవంతంగా మైదానంలోకి దించేందుకు బీసీసీఐ (BCCI) తగిన చర్యలు తీసుకోనుంది.

