కలం, కరీంనగర్ బ్యూరో: పీఎం కుసుం పథకం (PM Kusum Scheme)పై వివాదం చెలరేగింది. ఈ పథకం కేంద్ర నిధులతో నడుస్తున్నప్పటికీ ప్రధాని మోడీ ఫొటో ఎందుకు పెట్టడం లేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్వంలో ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రైతు వారము‘ అనే కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గురువారం కరీంనగర్ జిల్లా గంగిపల్లిలో ధనలక్ష్మి ధాన్య విత్తన రైతు పరస్పర సహకార పరిమిత సంఘం వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాగా పీఎం కుసుం పథకానికి ప్రధాని ఫొటో ఎందుకు పెట్టడం లేదని మాజీ ఎంపీటీసీ రంగు భాస్కరాచారి మండిపడ్డారు. వ్యవసాయక్షేత్రాలు, సౌరవిద్యుత్ కేంద్రాలు (పీఎం కుసుం పథకం)పై చర్చ జరుగుతున్న సందర్భంలో భాస్కరాచారి స్పందించారు. సీఎం కుసుం పథకం ప్రవేశపెట్టింది ఎవరు? ఈ పథకం ద్వారా నిధులు అందిస్తుంది ఎవరు? అధికారులకు ఈ అంశంపై కనీస అవగాహన లేదా? అంటూ ఆయన ఫైర్ అయ్యారు. కేంద్రప్రభుత్వ నిధులతో పీఎం కుసుం పథకం అమలవుతుందని, అలాంటప్పుడు కనీసం దేశ ప్రధాని ఫొటో ఎందుకు పెట్టలేదని ప్రవ్నించారు.
సోలార్ పంపుసెట్లకు సబ్సిడీ
పీఎం కుసుం పథకం ద్వారా పూర్తిస్థాయి కేంద్ర ప్రభుత్వ నిధులతో రైతులకు సోలార్ పంపుసెట్లు సబ్సిడీతో అందిస్తుందని తెలిపారు. అలాంటి గొప్పనైన పథకం అమలు చేయడానికి విధి విధానాలు తెలియజేయడానికి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు, ఆ పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం, పీఎం నరేంద్ర గురించి చెప్పకపోవడం, ప్రోగ్రాం బ్యానర్లో పీఎం ఫోటో పెట్టకపోవడం భావ్యం కాదన్నారు. అనంతరం భాస్కరాచారి సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు.

