కలం, జోగుళాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ (Gadwal Congress)లో అంతర్గత విభేదాలు మరోసారి రోడ్డుకెక్కాయి. సోమవారం ధరూర్ మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారిక పర్యటనలో వివాదం చెలరేగింది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సంబంధించిన అధికారిక శిలాఫలకంపై TGSGDCFL చైర్‌పర్సన్ సరిత పేరు లేకపోవడంతో వివాదం మొదలైంది. ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం పదవిలో ఉన్న తమకు కనీస గౌరవం ఇవ్వకుండా, ఉద్దేశపూర్వకంగానే పేరును మినహాయించారని సరిత అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అధికారులు, స్థానిక నాయకులు ప్రోటోకాల్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమె కార్యక్రమాన్ని మధ్యలోనే బహిష్కరించి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇటీవల ర్యాలంపాడు అర్ అండ్ అర్ సెంటర్ లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై TGSGDCFL చైర్ పర్సన్ సరిత పేరు లేకపోవడంతో పార్టీలోని కొందరు కావాలనే గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆమె వర్గీయులు ఆరోపిస్తున్నారు.
మంత్రి పర్యటన వేళ కాంగ్రెస్ పార్టీలోని ఈ వర్గపోరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, అధికారిక కార్యక్రమాల్లో నామినేటెడ్ చైర్మన్ ల పేర్లు శిలాఫలకపై పెట్టకూడదని జిల్లా ఉన్నతాధికారులు వెల్లడించారు. కార్యక్రమం అనంతరం మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, సరిత తిరుపతయ్య నివాసానికి వెళ్లి ఆమెతో మాట్లాడినట్లు సమాచారం.

