సమ్మర్‌లోనూ ఏసీ అవసరం లేని ఇల్లు.. కేరళ ‘పిరౌట్ హౌస్’

కలం, వెబ్​ డెస్క్​ : మండుతున్న ఎండల్లోనూ ఏసీ అవసరం లేకుండా, ప్రకృతి సిద్ధమైన చల్లదనాన్ని అందించే ఒక వినూత్నమైన ఇల్లు ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఈ పిరౌట్ హౌస్ (Pirouette House), ఎండకాలంలో కూడా ఎంతో కూల్‌గా ఉంటుంది. ఆర్కిటెక్ట్ వినూ డేనియల్ రూపొందించిన ఈ అద్భుత కట్టడం విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణ ఇళ్లలో వేసవి కాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది, కానీ ఈ పిరౌట్ హౌస్‌లో మాత్రం పరిస్థితి వేరు.

‘ర్యాట్ ట్రాప్ బాండ్’ అనే ప్రత్యేక ఇటుకల నిర్మాణ పద్ధతిని ఇక్కడ ఉపయోగించారు. ఇందులో ఇటుకలను నిలువుగా అమర్చడం వల్ల గోడల మధ్య ఖాళీ ప్రదేశం (Cavity) ఏర్పడుతుంది. ఈ ఖాళీ గాలికి ఇన్సులేటర్‌లా పనిచేసి, బయట ఉన్న వేడిని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటుందని, దీనివల్ల వేసవిలో ఇల్లు సహజంగానే చల్లగా ఉంటుందని వినూ డేనియల్ వివరించారు.

ఈ ఇంటి గోడలు అటు ఇటు వంగి ఉండి, డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తాయి. ఈ వంకర గోడల వల్ల ఇంటి లోపలికి గాలి వీయడం పెరుగుతుంది. అంతేకాకుండా, ఇంటి మధ్యలో సంప్రదాయ పద్ధతిలో ఏర్పాటు చేసిన ప్రాంగణం వేడి గాలిని బయటకు పంపడమే కాకుండా, ఇంట్లో వెలుతురు బాగా ఉండేలా చేస్తుంది. కిన్-ఫైర్డ్ ఇటుకల వాడకం వల్ల ప్యాసివ్ కూలింగ్ పద్ధతిలో ఇల్లు ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుంది.

మట్టి, ఇటుకలు, నిర్మాణ వ్యర్థాలతో ఈ ఇంటిని నిర్మించారు. ఈ పద్ధతి వల్ల సిమెంట్ వాడకం 40 శాతం, స్టీల్ వాడకం 30 శాతం తగ్గిందని ఆర్కిటెక్ట్ తెలిపారు. కేవలం చల్లదనం మాత్రమే కాదు, పాత చెక్కలు, స్థానిక బెత్తం (Cane) వంటి వాటిని ఫర్నీచర్‌గా మలచడం ద్వారా ఇది ఒక రీసైక్లింగ్ అద్భుతంగా నిలిచింది. కృత్రిమమైన ఏసీల మీద ఆధారపడకుండా, పాత కాలపు పద్ధతులను ఆధునిక టెక్నాలజీతో కలిపి కట్టిన ఈ ఇల్లు పర్యావరణ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>