​పెద్దపల్లి, మంచిర్యాల అభివృద్ధికి నిరంతర కృషి: ఎంపీ వంశీకృష్ణ

కలం, ​పెద్దపల్లి: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల సమగ్ర అభివృద్ధికి, నియోజకవర్గ ప్రజల రవాణా సౌకర్యాల మెరుగుదలకు తాము నిరంతరం శ్రమిస్తున్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న కీలకమైన రైల్వే నిర్మాణ పనులకు సంబంధించి ఆయన శుభవార్త అందించారు.

​మల్యాలపల్లి – భద్రిపల్లి వద్ద LHS నిర్మాణం

మల్యాలపల్లి, భద్రిపల్లి ప్రజల సుదీర్ఘకాల రవాణా సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించబోతోందని ఎంపీ (Gaddam Vamsi Krishna) తెలిపారు. రామగుండం పరిధిలోని మల్యాలపల్లి, భద్రిపల్లి గేట్ నెంబర్ 2A వద్ద ఉన్న లెవెల్ క్రాసింగ్ వద్ద లైట్ సబ్‌వే / అండర్‌పాస్ (LHS – Light Heights Subway) నిర్మించడం సముచితమని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ​

ఈ విషయమై ఎన్టీపీసీ (NTPC) ఉన్నతాధికారులతో చర్చించగా వారు నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించేందుకు అంగీకరించారని చెప్పారు. ఎన్టీపీసీ జనరల్ మేనేజర్ (GM) సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో మాట్లాడగా, మల్యాలపల్లి వద్ద ఎల్‌హెచ్‌ఎస్‌తో పాటు సరైన అప్రోచ్ రోడ్డును నిర్మించి, మల్యాలపల్లి – భద్రిపల్లి గ్రామాలు/ప్రాంతాలకు మెరుగైన రోడ్డు కనెక్టివిటీ కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ వివరించారు.

మార్చి 2027 నాటికి ఓదెల ఆర్‌యూబీ..

ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌ను కలిసి నియోజకవర్గంలోని పలు పెండింగ్ రైల్వే సమస్యలపై ఎంపీ చర్చించారు. ఓదెల రైల్వే స్టేషన్ పరిధిలోని ఎల్‌సీ-30 స్థానంలో నిర్మిస్తున్న ఆర్‌యూబీ-74ఏ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరగా, ఈ నిర్మాణాన్ని మార్చి 2027 నాటికి పూర్తి చేస్తామని రైల్వే అధికారులు ఎంపీకి లిఖితపూర్వక హామీ ఇచ్చారు. ఈ ఆర్‌యూబీ పూర్తయితే ఓదెల ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరుతుందని ఆయన తెలిపారు.

​గత పదేళ్లలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ, ప్రతి కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎంపీ వంశీకృష్ణ పునరుద్ఘాటించారు. అమరజీవి జీ. వెంకటస్వామి (కాకా) ఆశీస్సులతో, నియోజకవర్గ ప్రజల సహకారంతో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>