కర్ర గణపయ్య.. కొలువైన విశిష్ట సంప్రదాయం!

కలం, నిర్మల్: వినాయక చవితి వచ్చిందంటే రంగురంగుల విగ్రహాలు.. భారీ మండపాలు.. విద్యుత్ దీపాలంకరణలు.. నిమజ్జన శోభాయాత్రలు కనిపించడం సహజం. కానీ నిర్మల్ (Nirmal) జిల్లాలో మాత్రం గణనాథుడి ఆరాధనకు ఓ ప్రత్యేక సంప్రదాయం ఉంది. మట్టి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు భిన్నంగా కర్రతో వినాయక (Karra Ganapathi) విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించడం ఇక్కడ తరతరాలుగా కొనసాగుతోంది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్ మండలం పాలాజ్ గ్రామంలో సుమారు ఏడు దశాబ్దాల క్రితం వెలసిన ‘కర్ర గణనాథుడు’ ఈ సంప్రదాయానికి స్ఫూర్తిగా నిలిచాడు. పాలాజ్ కర్ర గణపతి స్ఫూర్తితో నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల్లోనూ అదే తరహాలో కర్ర గణపయ్యలను ప్రతిష్ఠించి నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నారు.

కుబీర్‌లో నవరాత్రుల్లోనే దర్శనం..

కుబీర్ మండల కేంద్రంలోని ప్రాచీన విఠలేశ్వర ఆలయంలో కొలువైన అరుదైన కర్ర గణపయ్య నవరాత్రుల సమయంలో మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు. వరసిద్ధి వినాయకుడిగా భక్తులు విశ్వసించే ఈ గణనాథుడికి ప్రత్యేక పూజలు, ముడుపులు సమర్పిస్తారు. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. నవరాత్రులు ముగిసిన అనంతరం నిమజ్జన రోజున వాగు నీటితో ప్రత్యేక పూజలు నిర్వహించి, విగ్రహాన్ని ఆలయంలోని ప్రత్యేక గదిలో భద్రపరుస్తారు. ఈ అరుదైన గణపయ్యను దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

Kubeer

భోసిలో ఆరు దశాబ్దాలుగా..

తానూర్ మండలం భోసి గ్రామంలో పాలాజ్ స్ఫూర్తితో 1963లో కర్ర వినాయకుడిని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఆ సంప్రదాయం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ గణనాథుడిని పూజిస్తే అనారోగ్యాలు దూరమవుతాయని, కోరిన కోరికలు తీరుతాయని స్థానికుల విశ్వాసం. గ్రామస్థులు ఒక్కచోట చేరి ఒకే గణపతిని పూజించడం ఇక్కడి ప్రత్యేకత.

Karra Ganapathi
Bhosi

సామూహిక హారతుల్లో మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు అధికంగా ఉన్న ఈ గ్రామంలో కర్ర గణనాథుడిని ప్రతిష్ఠించినప్పటి నుంచి ఏటా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే వారి సంఖ్య పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో 150 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, దీనిని విఘ్నేశ్వరుడి ఆశీస్సులుగా భావిస్తున్నారు.

అబ్దుల్లాపూర్‌లో ‘ఒకే ఊరు.. ఒకే గణపతి’..

లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్‌లో 1982 నుంచి కర్ర గణపయ్యను ప్రతిష్ఠిస్తున్నారు. సుమారు 2,500 జనాభా ఉన్న ఈ గ్రామంలో ‘ఒకే ఊరు.. ఒకే గణపతి’ అనే భావనతో నవరాత్రులను నిర్వహించడం విశేషం. వినాయక చవితి వచ్చిందంటే రాజకీయాలు, పార్టీలకు అతీతంగా గ్రామస్థులు ఒక్కతాటిపైకి వస్తారు. ఒకే చోట గణనాథుడిని ప్రతిష్ఠించి సామూహికంగా పూజలు, హారతులు నిర్వహిస్తారు. గణపతి ఉత్సవాలు గ్రామ ఐకమత్యానికి వేదికగా మారుతున్నాయి.

Karra Ganapathi
Abdullapur

మాటేగాంలో ‘కొరడి గణపతి’..

భైంసా మండలం మాటేగాం గ్రామంలో 2017లో ‘కొరడి గణపతి’ ఆవిర్భవించాడు. గ్రామానికి చెందిన ప్రకాష్ పటేల్ తన వ్యవసాయ భూమిలో చెట్లను వేర్లతో సహా తొలగించి ఇంటి ఆవరణలో ఉంచగా.. ఆ వేర్లలో వినాయకుడి ఆకృతిని పోలిన రూపాన్ని పిల్లలు గుర్తించారు. విషయాన్ని గ్రామస్థులకు తెలియజేయగా వేద పండితుల సూచనలతో దానికి ‘కొరడి గణపతి’గా నామకరణం చేసి ఆలయాన్ని నిర్మించారు. ఏటా వినాయక చవితి రోజున ప్రతిష్ఠించి 11 రోజుల పాటు నవరాత్రులు నిర్వహిస్తారు. ఉత్సవాలు ముగిసిన అనంతరం శోభాయాత్రగా తీసుకెళ్లి గంగాజలంతో నిమజ్జనం చేసిన తర్వాత మళ్లీ గర్భగుడిలో భద్రపరుస్తారు. ఈ ప్రత్యేక గణనాథుడిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు వస్తున్నారు.

Karra Ganapathi
Mategaon

కూతురి ఆరోగ్యం కోసం.. 18 రోజుల దీక్ష..

నిర్మల్ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన వజ్రా చారి వడ్రంగి వృత్తితో జీవనం సాగిస్తున్నారు. ఆయనకు చరిత, చార్మి అనే కవల కుమార్తెలు ఉన్నారు. చరిత పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించడంతో ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని తల్లిదండ్రులు పలువురు వైద్యులను సంప్రదించారు. ఫలితం లేకపోవడంతో కర్ర వినాయకుడి(Karra Ganapathi)ని తయారు చేసి పూజిస్తానని వజ్రా చారి మొక్కుకున్నారు.

18 రోజుల పాటు దీక్ష చేపట్టి.. టేకు కలపతో 2015లో కర్ర గణపయ్యను రూపొందించారు. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమించి విగ్రహాన్ని తయారు చేశారు. అనంతరం ఆ విగ్రహాన్ని నిర్మల్ పట్టణ కర్ర పారిశ్రామిక సంఘానికి అందజేశారు. అప్పటి నుంచి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో కర్ర గణపయ్యను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. నవరాత్రులు పూర్తయిన తర్వాత పట్టణ పురవీధుల్లో ఊరేగించి తిరిగి ఆలయంలో భద్రపరుస్తారు.

Nirmal

అన్నదానం.. సాంస్కృతిక కార్యక్రమాలు

కర్ర గణపతులను దర్శించుకునేందుకు నిర్మల్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. 11 రోజుల పాటు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలకు మరింత శోభ తీసుకొస్తున్నారు. భక్తుల సంఖ్య ఏటా పెరుగుతుండటంతో ఆయా గ్రామాల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి దర్శనానికి వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

కర్రలోనే పర్యావరణ సందేశం..

పర్యావరణ పరిరక్షణపై చర్చ జరుగుతున్న ప్రస్తుత కాలంలో కర్ర గణపతుల (Karra Ganapathi) సంప్రదాయం ప్రత్యేక సందేశాన్ని ఇస్తోంది. ప్రకృతికి అనుకూలమైన కలపతో విగ్రహాలను రూపొందించి.. నవరాత్రుల అనంతరం వాటిని భద్రపరచడం ద్వారా ప్రతి ఏడాది కొత్త విగ్రహాల తయారీ, వ్యర్థాల సమస్యను తగ్గించే విధానాన్ని ఈ సంప్రదాయం ప్రతిబింబిస్తోంది. భక్తి, సంప్రదాయంతో పాటు పర్యావరణ స్పృహను కూడా మోసుకొస్తున్న ఈ గణనాథులు ప్రత్యేకంగా నిలుస్తున్నారు.

Also Read : నిమ్స్ డాక్టర్ ఇంట్లో సోదాలు.. భారీగా అక్రమాస్తులు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>