కలం, నిజామాబాద్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ మతోన్మాద, ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా, యుద్ధోన్మాద దాడులను ఖండిస్తూ అమరవీరుల పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పీడీఎస్‌యూ (PDSU) జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, పీవైఎల్(PYL) జిల్లా అధ్యక్షుడు వనమాల సత్యం పిలుపునిచ్చారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల 95వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ (Nizamabad) నగరంలోని కోటగల్లిలో సాయిరెడ్డి పెట్రోల్ బంక్ వద్ద ఉన్న భగత్ సింగ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశాన్ని పరాయిపాలన నుండి విముక్తి చేయడానికి, సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ తమ ప్రాణాలను అర్పించారని కొనియాడారు. నేటి పరిస్థితులలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్వదేశీ జపం చేస్తూ విదేశీ పెట్టుబడిదారులకు దేశ సంపదను అప్పగిస్తుందని ఆరోపించారు. అలాగే, నూతన జాతీయ విద్య విధానంతో విద్యలో అశాస్త్రీయ భావజాలాన్ని ప్రవేశపెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగకపోవడం వల్ల కోట్లాది యువత నిరుద్యోగులుగా తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను కేంద్ర ప్రభుత్వం ఖండించాలని వారు కోరారు. విద్య, ఉపాధి అవకాశాల కోసం, సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా అమరవీరుల స్ఫూర్తితో పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంట్యాల రమేష్, పిడిఎస్‌యూ నగర అధ్యక్షులు సిర్రం పవన్ కుమార్, జిల్లా నాయకులు మనోజ్ కుమార్, నగర నాయకులు దత్తు , భవాని, పివైఎల్ నాయకులు కత్తుల సాయిలు, భాస్కర్, పిడిఎస్‌యూ నాయకులు యువ, ధ్రువ ప్రవీణ్, రమేష్, కళ్యాణ్, జీవన్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

