epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఇలాగైతే కష్టమే… ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ వార్నింగ్

కలం డెస్క్ : స్థానిక సంస్థల ఎన్నికల(Panchayat Elections) ఫస్ట్ ఫేజ్ ఫలితాలు కాంగ్రెస్‌కు అసంతృప్తినే మిగిల్చింది. ఆ పార్టీ ఆశించిన స్థాయిలో సర్పంచ్ స్థానాలను గెలిపించుకోలేకపోయింది. మెజారిటీ సీట్లను గెల్చుకుని అగ్రస్థానంలో ఉన్నా అంచనాకు తగినట్లుగా రాలేదన్నది పార్టీ భావన. రెండేండ్లలో అనేక సంక్షేమ పథకాలను అందించినా గ్రామీణ ప్రజలు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇందుకు ఎమ్మెల్యేలు సీరియస్‌గా పని చేయలేదనే అభిప్రాయానికి వచ్చింది. ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో సైతం పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోలేకపోవడాన్ని పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రస్తావించింది. కనీసం సెకండ్, థర్డ్ ఫేజ్ ఎన్నికల్లోనైనా సీరియస్ దృష్టి పెట్టి గెలిపించుకోవాలని ఎమ్మెల్యేలను పీసీసీ చీఫ్(Mahesh Kumar Goud) సున్నితంగా హెచ్చరించారు. పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మాట్లాడారు.

సంక్షేమం అందించినా ఫలితాలేవి? :

సుమారు 3,834 చోట్ల ఫస్ట్ ఫేజ్‌లో పోలింగ్ జరిగితే అందులో 2,872 చోట్ల కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. అంటే, మొత్తం 68% విజయం సాధించినట్లయింది. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం 1,160 చోట్ల గెలిచి దాదాపు 27% విజయాన్ని సాధించింది. రైతులకు రుణమాఫీ, రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషను దుకాణాల్లో సన్న బియ్యం, ఇందిరమ్మ చీరల పంపిణీ… ఇలాంటి చాలా రూపాల్లో లబ్ధి కల్పించినా స్థానిక ఎన్నికల్లో 70% కూడా ఓటు బ్యాంకును చేజిక్కించుకోకపోవడం కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆలోచనలో పడేసింది. బీఆర్ఎస్(BRS) బలహీనపడుతున్నదని భావిస్తున్నా దాదాపు మూడో వంతు విజయాన్ని ఖాయం చేసుకోవడం కాంగ్రెస్‌కు మంచి పరిణామం కాదని పీసీసీ బలంగా అభిప్రాయపడుతున్నది.

విపక్షాలు, రెబల్‌ల కంట్రోల్‌లో ఫెయిల్ :

విపక్ష పార్టీలను కట్టడి చేయడంలో, స్వంత పార్టీకి చెందిన రెబల్ అభ్యర్థులను కంట్రోల్ చేసుకోవడంలో స్థానిక ఎమ్మెల్యేలు విఫలమయ్యారని పీసీసీ చీఫ్(Mahesh Kumar Goud) వ్యాఖ్యానించారు. గెలిచే అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఎమ్మెల్యేలు ఫెయిల్ అయ్యారని, ఆ కారణంగానే రెబల్‌గా పోటీ చేసిన అభ్యర్థులు గెలిచారని అన్నారు. టార్గెట్ రీచ్ కాకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు పై అంశాలను ప్రస్తావించారు. స్వతంత్రులుగా గెలిచినవారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులేనని, వీరికి గెలుపు అవకాశాలున్నా ఎమ్మెల్యేలు వారిని గుర్తించి అభ్యర్థులుగా ఎందుకు నిలబెట్టలేదని ప్రశ్నించారు. బీజేపీ(BJP) కేవలం అర్బన్ ప్రాంతానికే పరిమితమైందని అనుకున్నా చివరకు గ్రామాల్లో కూడా వారి మద్దతుదారులు గెలవడం వెనక కారణాలను ఇప్పటికైనా ఎమ్మెల్యేలు, పార్టీ లోకల్ నాయకులు సమీక్షించుకోవాలని సూచించారు.

సెకండ్, థర్డ్ ఫేజ్‌లపై ఫోకస్ పెట్టండి :

ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని ఇకపై సెకండ్, థర్డ్ ఫేజ్‌లలో జరిగే ఎన్నికలపై ఫోకస్ పెట్టాలని పీసీసీ చీఫ్ సూచించారు. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నదని, అప్పుడే కాంగ్రెస్ కొన్ని స్థానాలను గెల్చుకోగలిగిందని, ఇప్పుడు అధికారంలో ఉండి కూడా గతంలో గెలిచిన సీట్లను ఈసారి ఎందుకు చేజిక్కించుకోలేకపోయామని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారం రోజుల పాటు జిల్లాల పర్యటన చేయడం వల్లనే కనీసం ఈ మేరకైనా ఫలితాలు వచ్చాయని, లేకుంటే పరిస్థితి మరింత ఘోరంగా ఉండేదన్న అభిప్రాయం సైతం రాష్ట్ర నాయకత్వంలో నెలకొన్నది.

బీఆర్ఎస్ గెలుపు వెనక వ్యూహమేంటి? :

స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ 11,60 సర్పంచ్ స్థానాలను గెల్చుకోవడం వెనక ఉన్న కారణాలను కాంగ్రెస్ విశ్లేషిస్తున్నది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా పలు స్థానాలను బీఆర్ఎస్ కైవశం చేసుకున్నది. గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ పట్ల విశ్వాసం కోల్పోయారా?.. లేక పార్టీలో అంతర్గత విభేదాలు ఆ పార్టీకి అడ్వాంటేజ్‌గా మారాయా?.. లేక మరేదైనా కారణమున్నదా?… ఇవన్నీ ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. సరిగ్గా ఈ గెలుపునే బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకుంటున్నది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నదని, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే అనే ప్రచారాన్ని ఆ పార్టీ నేతలు విస్తృతం చేశారు. పోల్‌ మేనేజ్‌మెంట్ అంశాన్ని కూడా పీసీసీ చీఫ్ ఆరా తీశారు.

ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో రిజల్ట్ తారుమారు :

పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారి స్వగ్రామాల్లో అభ్యర్థుల్ని గెలిపించుకోలేకపోయారు. మంత్రులు ఎలాగూ గ్లోబల్ సమ్మిట్ హడావిడిలో ఉన్నా ఎమ్మెల్యేలు మాత్రం నియోజకవర్గాల్లోనే ఉన్నారు. ప్రచారంలో మునిగిపోయినా అభ్యర్థుల్ని గెలిపించుకోలేకపోయారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ స్వగ్రామం సోమ్లా తండాలో గెలిపించుకోలేకపోయారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డిగూడలో బీజేపీ అభ్యర్థి గెలిచారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకరయ్య స్వగ్రామం వీర్లపల్లిలో మద్దతుదారుడ్ని గెలిపించుకోలేకపోయారు. ఇలాంటి ఉదాహరణలను పరిగణనలోకి తీసుకున్న పీసీసీ చీఫ్ కనీసం సెకండ్, థర్డ్ ఫేజ్‌లలో ఇలాంటి చేదు అనుభవాలు రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. మొదటి దశలో జరిగిన తప్పులు రిపీట్ కావద్దని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సొంత గ్రామాలపై దృష్టి పెట్టాలన్నారు. ఫస్ట్ ఫేజ్ కంటే ఎక్కువ శాతం విజయం సాధించాలని నొక్కిచెప్పారు.

Read Also: మంత్రుల్లో అసంతృప్తి మంటలు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>