కలం, నిజామాబాద్ బ్యూరో: రైతులపై బీఆర్ఎస్, బీజేపీ కపట ప్రేమ ఒలకబోస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. బీఆర్ఎస్ హయంలో కల్లాల్లో రైతులు ప్రాణాలు విడిచిన సంఘటనలు మరిచిపోలేదనీ గుర్తు చేశారు. మాది చేతల ప్రభుత్వం అని బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా స్పష్టం ఉందని పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డిలో డీసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ కమిటీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.
అన్ని వర్గాలకూ సంక్షేమం
అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీపై ఉందనీ పిలుపునిచ్చారు. ఉచిత బస్సు మొదలుకొని సన్న బియ్యం వరకు దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమం, గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు, పారదర్శకంగా కుల గణన సర్వే నిర్వహించామని చెప్పారు. వరి వేస్తే ఉరి అని ఆర్ఎస్ బీనేతలు అన్నారనీ, ఇప్పుడు రైతులపై బీఆర్ఎస్, బీజేపీ మొసలి కన్నీరు కారుస్తున్నాయని విమర్శించారు.
మళ్లీ కాంగ్రెస్‌దే అధికారం
ఎవరెన్ని చెప్పినా మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్నిపల్ ఎన్నికల్లో 75 శాతానికి పైగా సీట్లు గెలిచామని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇల్లు లేని పేదలకు ఇళ్లు అందజేయాలన్నది ఖర్గే, సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కల అని చెప్పుకొచ్చారు. విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసి పలాయనం చిత్తగించినా మొక్కవోని ధైర్యంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల నేతృత్వంలో ప్రజాపాలన సాగిస్తున్నారని కితాబు ఇచ్చారు. కష్టపడి పని చేయండి పార్టీ తప్పక గుర్తిస్తుందనీ కార్యకర్తలకు నాయకులకు ధైర్యం చెప్పారు.

