కలం, వెబ్ డెస్క్: సిరుల గనిగా పేరొందిన సింగరేణి కాంగ్రెస్ పాలనలో స్కాముల గనిగా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మీర్‌లో సింగరేణి సంస్థ సోలార్ పవర్ ప్లాంట్ కట్టేందుకు ఒప్పందం చేసుకుందని వివరించారు. పాకిస్థాన్ సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా కూడా నిర్మించని చోట.. సింగరేణి సంస్థ ఎందుకు, ఎవరి కోసం ప్లాంట్ నిర్మిస్తోందని ప్రశ్నించారు. అసలే తీవ్ర నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థ.. డీపీఆర్ లేకుండానే ఏడాదిన్నర కిందటే అప్పులు తెచ్చి ఎలా సివిల్ వర్క్స్ మొదలుపెట్టిందని మండిపడ్డారు. అప్పులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఉన్నఫళంగా పనులు ఆపేశారని, తద్వారా సంస్థకు రూ.800 కోట్ల నష్టం వచ్చిందన్నారు. దీని వెనుక ఉన్న కుట్రను మొత్తం త్వరలోనే బయటపెడుతామని హెచ్చరించారు.
రెండేళ్లలోనే రూ.14 వేల కోట్ల అప్పు..
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండున్నర ఏళ్లలోనే సింగరేణికి రూ.14 వేల కోట్ల అప్పు చేసిందని హరీశ్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్లిపోయి నాటికి రూ.4 వేల కోట్లు బాకీ ఉందన్నారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన మొత్తం రూ.21 వేల కోట్లుగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంస్థను ఓడీల వైపు నెట్టేసిందని.. తద్వారా కేంద్రం ఇచ్చే లిమిట్ రూ.3,200 కోట్లు కూడా దాటిపోయిందన్నారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించాలన్నా.. ఓడీ తెచ్చే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

