కలం, వెబ్ డెస్క్: శ్రీలంక ఆల్ రౌండర్ దసున్ షనక(Dasun Shanaka)పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఏడాది పాటు నిషేధం విధించింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 11వ సీజన్ నుండి తప్పుకోవడం ద్వారా లాహోర్ ఖలందర్స్ జట్టుతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆయన ఉల్లంఘించారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని బోర్డు తేల్చిచెప్పింది. ఈ నిర్ణయంతో 2027లో జరగబోయే పీఎస్ఎల్ 12వ సీజన్‌కు షనక దూరం కానున్నారు. పీఎస్ఎల్ ప్రస్తుత సీజన్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ లాహోర్ ఖలందర్స్ షనకను సుమారు 75 లక్షల రూపాయలకు (పాకిస్థాన్ కరెన్సీ) ఒప్పందం చేసుకుంది. అయితే, ఐపీఎల్‌లో గాయపడిన సామ్ కరణ్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరేందుకు షనక ఈ టోర్నీ నుండి అకస్మాత్తుగా తప్పుకున్నారు. మార్చి 21, 2026న ఆయన తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం ప్లేయర్ రిజిస్ట్రేషన్ నిబంధనలకు విరుద్ధమని పీసీబీ స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంపై సమగ్ర సమీక్ష నిర్వహించిన పీసీబీ, షనక ప్రవర్తన ఒప్పంద నియమాలను అతిక్రమించినట్లు నిర్ధారించింది. తదుపరి ఎడిషన్‌లో పాల్గొనే అర్హతను ఆయన కోల్పోయారని బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఫ్రాంచైజీ లీగ్ నిబంధనల ప్రకారం ఇరు పక్షాల మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందాన్ని గౌరవించడంలో ఆటగాడు విఫలమయ్యాడని బోర్డు పేర్కొంది. పీసీబీ నిర్ణయం వెలువడిన వెంటనే దసున్ షనక బహిరంగ క్షమాపణలు చెప్పారు. తన నిర్ణయం పట్ల తీవ్రంగా చింతిస్తున్నానని, పాకిస్థాన్ ప్రజలకు, లాహోర్ ఖలందర్స్ అభిమానులకు క్షమాపణలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. పీఎస్ఎల్ నుండి తప్పుకునే సమయంలో తనకు ఇతర టోర్నీలలో చేరే ఉద్దేశం లేదని ఆయన వివరణ ఇచ్చారు. పాకిస్థాన్ అభిమానుల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, భవిష్యత్తులో మళ్లీ ఈ లీగ్‌లో భాగం కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

