కలం, వెబ్ డెస్క్: ‘అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రాను ఎత్తిపడేస్తా.. మొదటి సంతకం దాని రద్దుపైనే చేస్తా’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రకటించడం సంచలనంగా మారింది. జగిత్యాల సభలో ఇదే హైలైట్ అంశమని, దీని వెనుక భారీ వ్యూహం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశంగా గులాబీ పార్టీ ప్రచారం చేయబోతుందని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. హైదరాబాద్ నగర పరిధిలో జలవనరుల రక్షణతో పాటు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం హైడ్రాను ఏర్పాటు చేసింది. మొదట్లో ఎన్ – కన్వెన్షన్ సెంటర్ వంటి అక్రమ నిర్మాణాలు కూల్చివేతతో ప్రజల్లో కూడా దీనిపై సానుకూలత వ్యక్తమైంది. అయితే, ఆ తరువాత.. మూసీ వెంబడి నివసిస్తున్న పేదల ఇళ్ల కూల్చివేతతో ఒక్కసారిగా వ్యతిరేకత ప్రారంభమైంది. దీన్ని అందిపుచ్చుకున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ.. పెద్ద ఎత్తున బాధితులతో సమావేశాలు, ధర్నాలు నిర్వహించింది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే ప్రధాన అస్త్రంగా ప్రచారం చేయబోతుంది. దానిలో భాగంగానే.. తమ ప్రభుత్వం వస్తే, హైడ్రా ను రద్దు చేస్తానని చెప్పడం ద్వారా.. నగర ఓటర్ల మద్దతు గెలుచుకోవాలని భావిస్తోంది.
మరి కేసీఆర్ హైడ్రా ఎత్తివేస్తామన్న వ్యూహం బీఆర్ఎస్‌కు అస్త్రంగా పనిచేస్తుందా? హైదరాబాద్ ప్రజలంతా హైడ్రాను వ్యతిరేకిస్తున్నారా? అన్నది వేచి చూడాలి. హైడ్రా తీసుకొచ్చి ఎన్నో చెరువులను తాము రక్షించామని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటున్నది. బీఆర్ఎస్ మాత్రం హైడ్రా మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. హైడ్రా కొన్ని చోట్ల నిర్మాణాలు కూల్చివేసిన తీరుపై కూడా విమర్శలు వచ్చాయి. చిన్న పిల్లలు తమ పుస్తకాలు, వస్తువులు తెచ్చుకోనివ్వకుండా హైడ్రా బుల్‌డోజర్లు నిర్మాణాలను కూల్చివేసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొత్తంగా హైడ్రా మీద జనంలో మిశ్రమస్పందనే కనిపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఇదే అంశాన్ని ఎత్తుకున్నది. కేసీఆర్ ప్రకటన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఏ మేరకు లాభిస్తుందో వేచి చూడాలి.

