కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి రానున్న మంత్రుల పర్యటనను విజయవంతం చేయడానికి పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నట్లు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (Payam Venkateswarlu) తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులతో కలిసి గొందిగూడెంలోని సభాస్థలి, మారెళ్లపాడులోని హెలిప్యాడ్, ఎత్తిపోతల పథకం డెలివరీ పాయింట్లను తనిఖీ చేశారు.
సభా ప్రాంగణంలో ప్రజలకు తాగునీరు, నీడ సదుపాయాలు కల్పించాలని, హెలిప్యాడ్ పనులను భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రుల ప్రయాణ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి బుధవారం జరగబోయే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

