కలం, వెబ్ డెస్క్: ఏపీలోని గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం అత్యంత పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుత సౌకర్యాలు, ఎలాంటి అవసరాలు ఉన్నాయనే వివరాలతోపాటు పంచాయతీ భూములు, పోరంబోకు స్థలాలు, స్మశానవాటికలు, పశువుల మేత మైదానాలు పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. ఈ సర్వే నివేదికలు ఆధారంగా గ్రామాల్లో భూములకు రక్షణ కల్పిస్తామన్నారు. దీనితో పాటుగా ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించేలా నూతన ఆదాయ వనరులను సృష్టించవచ్చని చెప్పారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పల్లె పండుగ 1, 2 కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో జరుగుతున్న ప్రగతిపై భేటీలో చర్చించారు.
పల్లె పండుగతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు..
పల్లె పండుగ 1, 2 కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. పల్లె పండుగ తొలి విడతలో అనుకున్నట్లుగానే పూర్తిగా 4 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. అలాగే 2వ విడతలో 2,750 కిలోమీటర్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. దీనికంటే ఎక్కువగా 3,580 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించామని వెల్లడించారు. మొదటి విడతలో 22,500 గోకులాలు నిర్మించాలనే లక్ష్యానికి గానూ 22,514 పూర్తి చేశామని ప్రకటించారు. ఇక రెండవ విడతలో 15 వేల లక్ష్యానికి గానూ 15,303 గోకులాలు నిర్మించామన్నారు.
గ్రామాల్లో పశువుల తాగునీటి అవసరాల కోసం 15 వేల లక్ష్యానికి గానూ 15,188 నీటి తొట్టెలు నిర్మించామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తొలి విడతలో 20 వేల ఫార్మ్ పాండ్స్ లక్ష్యానికి గానూ 21 వేలు పూర్తి చేశామన్నారు. ఇక రెండవ విడతలో ఈ పనులను భారీగా పెంచి 81 వేలు లక్ష్యానికి గానూ 86 వేలు ఫార్మ్ పాండ్స్ కుంటలను తవ్వించామని ప్రకటించారు. గ్రామాల్లో మురుగునీటి సమస్య నివారణే లక్ష్యంగా పల్లె పండుగ 2.0 కింద సరికొత్తగా 59 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైన్స్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే క్షేత్రస్థాయిలో 32.30 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయని తెలిపారు.
మురుగునీటి సమస్యకు మ్యాజిక్ డ్రెయిన్స్..
గ్రామాల్లో మురుగునీటి సమస్యను శాశ్వతంగా అరికట్టేందుకు మ్యాజిక్ డ్రెయిన్స్ విధానాన్ని మరింత ఎక్కువ గ్రామాల్లో ప్రవేశపెట్టాలని అధికారులకు డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేశారు. నల్లరేగడి నేలలు, డెల్టా ఏరియాల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది కాబట్టి, అక్కడి భూములకు తగినట్లుగా ఈ మ్యాజిక్ డ్రెయిన్లను నిర్మించాలన్నారు. కొండలు, గుట్టలతో కూడిన మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా పరిశుభ్రతను పెంచేందుకు ఈ సరికొత్త డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు.
రోడ్ల నాణ్యత లోపిస్తే సహించేది లేదు..
గ్రామాల్లో నిర్మించే సీసీ రోడ్లు దీర్ఘకాలం మన్నేలా ఉండాలన్నారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలనరు. నాణ్యత లోపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సీసీ రోడ్డు వేసిన తర్వాత ఇరువైపులా అలాగే వదిలేయకుండా, మట్టితో పక్కాగా వాలు చేయాలని చెప్పారు. పల్లె ప్రజలకు నాణ్యమైన, దీర్ఘకాలం మన్నే రహదారులను అందించడమే లక్ష్యంగా రోడ్లకు జియో మానిటరింగ్ సిస్టమ్ ను తీసుకొచ్చామని వివరించారు. ప్రజలు కూడా రోడ్ల యొక్క ప్రస్తుత స్థితిగతులను ఆన్‌లైన్ ద్వారా డైరెక్ట్ గా తెలుసుకునే వీలు ఉంటుందని చెప్పారు.

