కలం, వెబ్ డెస్క్: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ రేసులో ప్రపంచ నంబర్ వన్, ఇటలీ సంచలనం జాన్నిక్ సినర్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. గత ఏడాది ఫైనల్లో సినర్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచిన అతని ప్రధాన ప్రత్యర్థి కార్లోస్ అల్కరాజ్ ఈ సారి టోర్నీకి దూరంగా ఉన్నారు. గాయం కారణంగా అల్కరాజ్ దూరం కావడంతో సినర్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఒకవేళ జూన్ 7న జరిగే ఫైనల్లో సినర్ ఈ టైటిల్ గెలిస్తే, నాలుగు మేజర్ ట్రోఫీలను సాధించి కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసిన తొమ్మిదో ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.
ప్రస్తుతం 24 ఏళ్ల సినర్ వరుసగా 6 మాస్టర్స్ టైటిళ్లతో పాటు 34 మ్యాచ్‌ల విజయాల పరంపరతో తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ఇటాలియన్ ఓపెన్ ఫైనల్లో సినర్ చేతిలో ఓడిపోయిన కాస్పర్ రూడ్ స్పందిస్తూ.. గతంలో నాదల్, ఫెడరర్, జకోవిచ్‌లు తమ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నప్పుడు ప్రత్యర్థులకు ఎలాంటి భయం కలిగించేవారో, ఇప్పుడు సినర్ కూడా అదే ఫీలింగ్ ఇస్తున్నాడని కొనియాడారు. గత సెప్టెంబర్ నుండి ఆడిన 10 టోర్నమెంట్‌లలో సినర్ కేవలం రెండు సార్లు మాత్రమే ఓడిపోవడం అతని ఫామ్‌కు అద్దం పడుతోంది.
మరోవైపు ఫామ్, ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ 4వ ర్యాంకర్ నోవాక్ జకోవిచ్ తన రికార్డు స్థాయి 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం సినర్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. అల్కరాజ్ దూరం కావడంతో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ రెండో సీడ్‌గా బరిలోకి దిగుతుండగా, ఫ్రాన్స్ స్టార్ ఆర్థర్ ఫిల్స్, స్పెయిన్ యువ సంచలనం రాఫెల్ జోదార్‌లపై కూడా అందరి కళ్లూ ఉన్నాయి.

