కలం, వెబ్‌డెస్క్: పిల్లల్లో ఒత్తిడి (Stress) అనేది ఈ రోజుల్లో చాలా సాధారణమైన సమస్యగా మారిపోయింది. చదువుల భారం, మార్కుల పట్టింపు, స్నేహితుల మధ్య పోటీ, లేదా ఇంట్లో వాతావరణం ఇలా రకరకాల కారణాల వల్ల పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. అయితే పెద్ద వాళ్లతో పోలిస్తే పిల్లలు తమ ఒత్తిడిని మాటల్లో చెప్పలేరు. అందుకే పిల్లల్లో ఒత్తిడిని తగ్గించి, వారు ప్రశాంతంగా, సంతోషంగా ఉండేలా చేయడానికి తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన చిట్కాలు (Parenting Tips) పాటించాలని సూచిస్తున్నారు. నిపుణులు.
గేమ్స్ ఆడించడం
ఈ కాలపు పిల్లలకు బయటకు వెళ్లి ఆడుకునేందుకు సమయం దొరకడం లేదు. ఎప్పుడు చూసినా చదువు-హోమ్ వర్క్, ట్యూషన్లు అంటూ బిజీగా గడిపేస్తున్నారు. ఇక సెలవులు వచ్చినా, కాస్త ఖాళీ సమయం దొరికినా స్మార్ట్ ఫోన్‌లోనే గేమ్స్ ఆడేస్తుంటారు. ఈ అలవాట్లు పిల్లల్లో ఒత్తిడికి కారణమవుతున్నాయంటున్నారు నిపుణులు. అందుకే ప్రతి రోజూ సాయంత్రం ఓ గంట సేపు పిల్లలతో ఆటలాడించేందుకు తల్లిదండ్రులు సమయం కేటాయించాలని సూచిస్తున్నారు. ఆటలు ఆడటం వల్ల శరీరంలో ఒత్తిడిని తగ్గించే ఎండార్ఫిన్లు విడుదలవుతాయట. ఆటలతో పాటు రన్నింగ్, సైక్లింగ్, డ్యాన్సింగ్.. వంటి వాటిని వారి జీవనశైలిలో భాగం చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
ప్రేమతో హత్తుకోవడడం
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో బిజీగా ఉండే తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగకపోవడం కూడా ఒత్తిడికి కారణమవుతుందట. పిల్లల మనసును బాగా అర్థం చేసుకోవాల్సిన తల్లిదండ్రులే.. పనుల్లో బిజీగా ఉండడం వల్లో లేదంటే వారిని భయపెట్టాలనో స్నేహపూర్వకంగా మెలగరు. చిన్నారులను తల్లిదండ్రులు దూరం పెట్టడం వలన వారు ఒంటరిగా ఫీలై ఒత్తిడికి లోనయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే వారిని రోజుకు ఒకసారైనా ప్రేమగా దగ్గరగా తీసుకుని గుండెలకు హత్తుకోవడం ముఖ్యమని చెబుతున్నారు. దీనివల్ల పిల్లలలో ఒత్తిడి తగ్గడంతో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందట.
పిల్లల డైట్‌లో ఇవి చేర్చండి
పిల్లల్లో మానసిక ఒత్తిడిని అధిగమించడంలో మనం ఇచ్చే ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అరటిపండ్లు, నట్స్ (బాదం, వాల్‌నట్స్ వంటివి), పాలు, పాల పదార్థాలను పిల్లల రోజువారీ డైట్‌లో తప్పనిసరిగా భాగం చేయాలట. ఈ ఆహార పదార్థాలు మెదడులో ‘ఫీల్ గుడ్’ హార్మోన్ అయిన సెరటోనిన్ (Serotonin) స్థాయులను పెంచి, ఒత్తిడిని సమర్థవంతంగా దూరం చేస్తాయి. సాధారణంగా కొంతమంది పిల్లలు ఒత్తిడిలో ఉన్నప్పుడు స్వీట్స్ తినడానికి ఇష్టపడతారు. అయితే, మైదాతో చేసిన బేకరీ స్వీట్స్‌కు బదులుగా వారికి డార్క్ చాక్లెట్ (Dark Chocolate) ఇవ్వడం వల్ల తీపి తినాలనే కోరికను తీర్చడమే కాకుండా, వారి మూడ్‌ను తక్షణమే మార్చి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు.
చిన్న ప్రశంస.. పెద్ద మార్పు
పిల్లలను అతిగా గారాబం చేస్తే మాట వినరని, భవిష్యత్తులో చేజారిపోతారనే భయంతో చాలా మంది తల్లిదండ్రులు ఎప్పుడూ సీరియస్‌గా, కఠినంగా వ్యవహరిస్తుంటారు. అయితే, అన్ని సందర్భాల్లో పిల్లలతో ఇలా ఉండటం సరికాదని (Parenting Tips) హెచ్చరిస్తున్నారు నిపుణులు. అప్పటికే చదువు లేదా ఇతర కారణాల వల్ల ఒత్తిడి ఎదుర్కొంటున్న పిల్లలపై తల్లిదండ్రలు కఠినంగా వ్యవహరించడం వలన నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తుందట. దీనివల్ల వారు మానసికంగా మరింత కుంగిపోయేలా ప్రమాదం ఉందంటున్నారు. ఇలాంటి స్థితిలో ఉన్న పిల్లల్ని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఒక చిన్న ప్రశంస మంత్రంలా పనిచేస్తుందట. మనం పిల్లలను మెచ్చుకున్నప్పుడు వారి మెదడులో ఆనందాన్ని, ప్రశాంతతను కలిగించే డోపమైన్ (Dopamine) అనే హార్మోన్ స్థాయులు పెరుగుతాయి. ఇది వారిని మానసికంగా మరింత దృఢంగా మారుస్తుందని చెబుతున్నారు.
సంగీతంతో ఒత్తిడికి చెక్
పిల్లల్లో ఒత్తిడి, ఆందోళనల్ని దూరం చేయడానికి మ్యూజిక్ థెరపీ బెస్ట్ అని సూచిస్తున్నారు నిపుణులు. పిల్లల ఒత్తిడిని దూరం చేయడంలో ఈ థెరపీ మ్యాజిక్‌లా పనిచేస్తుందట. ఈ చికిత్స వల్ల భావోద్వేగాలు అదుపులో ఉంటాయట. పిల్లలు తమ భావాల్ని కూడా ధైర్యంగా బయటపెట్టగలుగుతారట! ఫలితంగా వారు ఒత్తిడికి లోనవడానికి గల కారణాలేంటో తెలుస్తాయి. వాటిని దూరం చేస్తే పిల్లలు హ్యాపీగా ఉండగలుగుతారని చెబుతున్నారు నిపుణులు.
Read Also: అమెజాన్ జాబ్‌కు గుడ్‌బై.. ఉబెర్ డ్రైవర్‌గా హైదరాబాద్ వ్యక్తి, వైరల్!
Follow Us On: Instagram

