Mobile Popup Ad
Mobile Popup Ad

ఖరీదైన గిఫ్ట్స్ కాదు.. పిల్లలకు పేరెంట్స్ తప్పక ఇవ్వాల్సినవి ఇవే!

కలం, వెబ్‌డెస్క్: నేటి ఆధునిక కాలంలో తల్లిదండ్రులు పిల్లల కోరికలను తీర్చడానికి, వారి ముఖాల్లో ఆనందం చూడటానికి వేల రూపాయలు ఖర్చు చేసి ఖరీదైన గ్యాడ్జెట్లు, బ్రాండెడ్ వస్తువులు, విలాసవంతమైన బొమ్మలను బహుమతులుగా ఇస్తున్నారు. అయితే, డబ్బుతో కొనే ఈ వస్తువులు పిల్లలకు తాత్కాలిక సంతోషాన్ని మాత్రమే ఇస్తాయి. నిజానికి పిల్లల మానసిక వికాసానికి, వారి ఎదుగుదలకు ఖరీదైన వస్తువుల కంటే తల్లిదండ్రుల నుంచి లభించే కొన్ని అమూల్యమైన కానుకలు చాలా అవసరమని సూచిస్తున్నారు నిపుణులు. తల్లిదండ్రులు పిల్లల పెంపకం (Parenting) లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. పిల్లలు తల్లిదండ్రుల నుంచి ప్రతిరోజూ కొత్త జీవిత పాఠాలు నేర్చుకుంటారు. వారినే అనుకరిస్తారు.

ఇంట్లో తల్లిదండ్రులు ప్రవర్తించే తీరు, వారి రోజువారీ చిన్న చిన్న అలవాట్లు పిల్లల ఆలోచనలను, భావోద్వేగాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయట. అందుకే ఖరీదైన బహుమతుల కంటే తల్లిదండ్రులు చూపే ప్రేమ, ప్రవర్తించే తీరు మాత్రం పిల్లల మనసులో చెరగని ముద్ర వేస్తాయి. ఒక బలమైన, ఆరోగ్యకరమైన కుటుంబ వ్యవస్థకు పునాది కేవలం పెంపకంలోనే ఉంటుంది. పిల్లలు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల మాటలను అత్యంత జాగ్రత్తగా గమనిస్తారు. తల్లిదండ్రులు ఇంట్లో దయగా, గౌరవంగా మాట్లాడటం వల్ల పిల్లల్లో భావోద్వేగ భద్రత పెరుగుతుందట. కఠినమైన మాటలు, అధిక క్రమశిక్షణ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. అదే సానుకూల పదజాలం వారికి ఎదుటివారిని గౌరవించడం, దయతో ఉండటం వంటి విలువలను నేర్పిస్తుంది.

ఖరీదైన ఆటబొమ్మలు vs అమ్మనాన్నల సమయం

నేటి యాంత్రిక జీవనంలో పనులు, బాధ్యతల నడుమ తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం కరువవుతోంది. దీన్ని కవర్ చేయడానికి తల్లిదండ్రులు పిల్లలకు రకరకాల ఆటబొమ్మలు, గిఫ్ట్స్ తెచ్చిస్తారు. కానీ పిల్లలు బొమ్మల కంటే తల్లిదండ్రుల సమయాన్ని, దృష్టిని ఎక్కువగా విలువైనదిగా భావిస్తారట. కలిసి భోజనం చేయడం, చిన్నపాటి కబుర్లు చెప్పుకోవడం, ఆటలు ఆడడం వంటివి కుటుంబ బంధాలను దృఢపరుస్తాయి.

సరైన పెంపకమే.. విలువైన ఆస్తి

పిల్లలు మాటల కంటే చర్యల ద్వారానే ఎక్కువ నేర్చుకుంటారు. తల్లిదండ్రులు నిజాయితీగా, క్రమశిక్షణతో వ్యవహరిస్తే, పిల్లలు ఆటోమేటిక్‌గా వాటిని అలవాటు చేసుకుంటారు. పిల్లల చిన్న చిన్న విజయాలను అభినందించడం, వారి ప్రయత్నాలను ప్రశంసించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. క్రమశిక్షణను భయం ద్వారా కాకుండా, ప్రేమ ద్వారా బోధించినప్పుడే అది పిల్లల వ్యక్తిత్వంలో భాగమవుతుంది. ఇంట్లో పాటిస్తున్న చిన్నపాటి మంచి అలవాట్లు, పరస్పర గౌరవం పిల్లలను రేపటి సమాజంలో భావోద్వేగ సమతుల్యత ఉన్న వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. సరైన పెంపకం అనేది పిల్లలకు మీరు ఇచ్చే అత్యంత విలువైన ఆస్తి అని గుర్తుంచుకోవడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>