కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో పోలీసుల (Hyderabad Police) ప్రవర్తనపై ఓ యువకుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తాను హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వెళ్తున్నప్పటికీ పోలీసులు తనను లక్ష్యంగా చేసుకుని లాఠీతో కొట్టారని యువకుడు ఆరోపించాడు. తన చుట్టూ చాలామంది హెల్మెట్ లేకుండా, ముగ్గురు కలిసి బైక్‌పై ప్రయాణిస్తున్నా వారిని వదిలేసి, గోప్రో కెమెరా పెట్టుకుని సరిగ్గా వెళ్తున్న తనపైనే పోలీసులు దృష్టి పెట్టారని వాపోయాడు. బస్సు, బైక్ మధ్య ఇరుక్కుపోయిన పరిస్థితిలో తప్పించుకునే అవకాశం కూడా లేకపోయిందని తెలిపాడు. అయినప్పటికీ పోలీసులు లాఠీతో కొట్టడం అన్యాయమని ప్రశ్నించాడు.
“నేను ఏమైనా నేరం చేశానా ? గొడవ పడ్డానా ? ప్రజలకు ఇబ్బంది కలిగించానా ? లేక ఏదైనా ఘోరమైన తప్పు చేశానా ? కేవలం రూల్స్ పాటించాననే కారణంతో లాఠీ దెబ్బలు తినాలా?” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా, “ప్రజలకు తమ హక్కులు తెలియకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణం. పోలీసులకు ప్రశ్నించే హక్కు ఉన్నట్లే, ప్రజలకు కూడా ప్రశ్నించే హక్కు ఉంది. నేను ప్రశ్నించగానే అది ఈగోగా తీసుకుని కానిస్టేబుల్‌ను పంపించి బైక్ సీజ్ చేయాలని ఆదేశించారు. అసలు ఎందుకు? నిజమైన దొంగలను వదిలేసి సామాన్యులను వేధించడం మాత్రమేనా మీ పని ?” అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, పోలీసులు వ్యవహరించిన తీరుపై పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

