కలం, వెబ్ డెస్క్: పిల్లలు పుట్టడం, వారి చేత అమ్మా, నాన్న అని పిలిపించుకోవడం ప్రతి ఒక్కరికీ ఒక పెద్ద వరమనే చెప్పాలి. దంపతుల జీవితంలోకి ఒక బాబో, పాప వచ్చాడంటే ఆ కుటుంబం సంతోషం పెరుగుతుంది. పిల్లల పెంపకం (Parenthood) ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇదే ఇన్నాళ్లూ మనం అనుకున్నది. కానీ తాజా పరిశోధన మాత్రం అందుకు విరుద్ధమైన అంశాలను వెల్లడించింది. పిల్లల పెంపకం తల్లిదండ్రుల సంతోషంపై ఎటువంటి ప్రభావం చూపదని ఈ పరిశోధన తేల్చింది. జనవరి 2026లో ‘ఎవల్యూషనరీ సైకాలజీ’ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధనలో విస్తుబోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూనివర్సిటీ ఆఫ్ నికోసియా పరిశోధకులు జరిపిన ఈ అధ్యయనం ప్రకారం, తల్లిదండ్రులు అయినంత మాత్రాన సంతృప్తి లేదా ఆనందం పెరగదు. పిల్లలు ఉన్నవారు, లేనివారి సంతోష స్థాయిలను పోల్చి చూసినప్పుడు పెద్దగా తేడా ఏమీ లేదని తేలింది. పిల్లలు పుట్టిన తర్వాత జీవితానికి ఒక ‘లక్ష్యం’ దొరికినట్లు అనిపించినా, అది వ్యక్తిగత మానసిక ఉల్లాసాన్ని మాత్రం పెంచలేదని పరిశోధకులు గుర్తించారు.
బంధంపై ప్రభావం
చాలామంది దంపతులు తమ మధ్య ఉన్న విభేదాలను తొలగించుకోవడానికి లేదా తమ బంధాన్ని కాపాడుకోవడానికి పిల్లలు కావాలని కోరుకుంటారు. అయితే, వాస్తవం దీనికి భిన్నంగా ఉందని ఈ సర్వే చెబుతోంది. పిల్లల పెంపకం(Parenthood)లో ఉండే విపరీతమైన ఒత్తిడి, పెరుగుతున్న బాధ్యతల వల్ల దంపతుల మధ్య ఉండే రొమాంటిక్ బంధం బలహీనపడే అవకాశం ఉందని పరిశోధన హెచ్చరించింది. పిల్లలను కనడం అనేది కేవలం ఒక వ్యక్తిగత ఆనందం కోసం చేసే పని కాదని, అది అంకితభావంతో కూడిన ఒక పెద్ద బాధ్యత అని అధ్యయనం స్పష్టం చేసింది. పిల్లలు పుట్టగానే జీవితం మంత్రదండంలా మారిపోయి సంతోషాన్ని ఇచ్చేస్తుందనే అపోహ నుంచి బయటకు రావాలని నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు కావడం వల్ల కలిగే మార్పులను వాస్తవ దృక్పథంతో అర్థం చేసుకోవడం అవసరమని ఈ పరిశోధన సారాంశం. పిల్లల పెంపకం అనేది ఒక సవాలుతో కూడిన ప్రయాణం కాబట్టి, దాన్ని ఒక బాధ్యతగా స్వీకరించినప్పుడే మెరుగైన ఫలితాలు ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

