కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) మండలంలోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(బీటీపీఎస్) నుంచి వస్తున్న బూడిద వలన కాలుష్యం పెరిగి పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా రైతుల పంటలు కూడా దెబ్బతింటున్నాయని బాధిత ప్రజలు ఆరోపిస్తున్నారు. బీటీపీఎస్ 2020 నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. కాగా 2022 నాటికి నాలుగు యూనిట్లతో కలిపి 1080 మెగా వాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుండటంతో బూడిద కూడా పెద్ద మొత్తంలో వెదజల్లుతోంది. సాధారణంగా థర్మల్ విద్యుత్ ప్లాంట్లు బొగ్గును మండించి విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంటాయి. బొగ్గును మండించడం వలన పెద్ద మొత్తంలో విడుదలయ్యే బూడిదను ఒక ప్రత్యేక వ్యవస్థ ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా నిర్వహించాల్సి ఉంటుంది. అయితే నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్లనే విద్యుత్ కేంద్రం నుండి వెలువడిన బూడిద నీరు, కాల్వల ద్వారా ప్రవహించి సమీపంలోని వందలాది ఎకరాల పొలాల్లోకి చేరుతుందని రైతులు వాపోతున్నారు. పంటల పై బూడిద చేరడం వలన కిరణ జన్య సంయోగ క్రియకు ఆటంకం ఏర్పడి మొక్క ఎదుగుదల ఆగిపోతుందని యువ రైతులు బాధ పడుతున్నారు.
నిర్వహణ సరిగ్గా లేకపోవడం..
ప్రజలను, పశువులను, పంటలను నానా రకాలుగా ఇబ్బందుల పాలు చేస్తున్న బూడిద.. థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో రెండు రకాలుగా విడుదల అవుతుంటుందని నిపుణులు చెబుతున్నారు. అవి ఒకటి ఫ్లై యాష్.. ఇది చాలా తేలికగా ఉండి బాయిలర్ గొట్టాల ద్వారా గాలిలోకి ఎగురుతుంటుంది. ఈ బూడిదను ప్రత్యేక యంత్రాలు ఉపయోగించి గొట్టాల నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకుంటారు. తర్వాత క్లోజ్డ్ కంటైనర్ల ద్వారా సిమెంట్ కంపెనీలకు తరలిస్తారు. రెండోది బాటమ్ యాష్, బరువుగా ఉండటం వలన బాయిలర్ అడుగుభాగంలో పేరుకుపోతుంది. ఈ బూడిదను నీటితో కలిపి పైప్ లైన్ల ద్వారా యాష్ పాండ్స్(కృత్రిమంగా ఏర్పాటు చేసిన బూడిద చెరువు) కు పంపిస్తారు. ఇక్కడే సమస్య మొదలవుతుంది. ఎందుకంటే ఇలా పంపించిన బూడిద మిశ్రమం కలిసి ఉన్న నీళ్లు చెరువులోకి వెళ్లకుండా రైతుల పొలాల్లోకి వెళ్తున్నాయి. ఇందుకు కారణం యాష్ పాండ్స్ నిర్వహణ సరిగ్గా లేకపోవడమే అనేది బహిరంగ రహస్యమే.
కాబట్టి బీటీపీఎస్ యాజమాన్యం యాష్ పాండ్స్ నిర్వహణ సక్రమంగా చేయాలని మణుగూరు (Manuguru) పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు కోరుతున్నారు. శాస్త్రీయ పద్ధతిలో బూడిద నీటిని శుభ్రం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు బరోసా కల్పించాలని, పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నాయి : చంటి బాబు, రైతు సాంబైగూడెం
ఈ సంవత్సరం రెండు ఎకరాల్లో పొగాకు వేస్తే, బూడిద నీరు వలన మొక్క వాడిపోయింది. మినప పంట వేస్తే అది కనీసం మొలకెత్తని పరిస్థితి. నేల పై బూడిద పొరలా పేరుకుపోవడం వలన సారం కోల్పోవడమే కాకుండా, విత్తనం మొలకెత్తడం లేదు. బూడిద నీరు భూగర్భ జలాలతో కలిసి పోవడం వలన, బోరు బావుల్లోని నీరు తాగలేక పోతున్నాం. బూడిద ఎండిన తరువాత గాలికి కొట్టుకొని రావడం వలన శ్వాస కోశ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే కలుషితమైన గడ్డిని, బూడిద నీటిని తాగడం వల్ల పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయి.

