Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నమ్మకద్రోహం చేసింది: హరీశ్ రావు

కలం, మెదక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు నాడే తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ‘రైతు డిక్లరేషన్‌’ను బొంద పెట్టిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు (Harish Rao) తీవ్రంగా విమర్శించారు. సిద్దిపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ కేబినెట్ తీసుకున్న వ్యవసాయ వ్యతిరేక నిర్ణయాలపై, అసంపూర్తిగా ఉన్న రైతు భరోసా, నిలిచిపోయిన రైతు బీమా వంటి అంశాలపై రేవంత్ సర్కార్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

​​కేంద్ర ప్రభుత్వం చెబితేనే ధాన్యం కొంటామంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతులెత్తేసిందని , రైతులకు బోనస్ ఇవ్వకుండా, కొనుగోళ్లు సరిగ్గా చేపట్టకుండా దద్దమ్మ ప్రభుత్వంగా నిలిచిందని విమర్శలు గుప్పించారు. గతంలో 33 రకాల సన్న బియ్యం రకాలకు బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఆ సంఖ్యను కేవలం 7 రకాలకే కుదించారని, ఇది రైతులకు బోనస్ ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం పన్నుతున్న పన్నాగమని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని క్యాబినెట్ పేపర్ల కేబినెట్ కాదని, అన్నదాతలను నిలువునా దగా చేసిన నమ్మకద్రోహ క్యాబినెట్ అని విమర్శించారు.

​ప్రభుత్వంలోకి వచ్చిన 45 రోజుల్లో రైతు భరోసా ఇస్తామని నమ్మించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను ఘోరంగా మోసం చేశారని హరీశ్ రావు దుయ్యబట్టారు. గత ఐదు సీజన్లలో రేవంత్ సర్కార్ రైతులకు ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులు అక్షరాలా రూ.29,358 కోట్లు అని ఆయన లెక్కలతో సహా వివరించారు. గడిచిన 5 నెలలుగా రాష్ట్రంలో రైతు బీమా పథకం పూర్తిగా బంద్ అయిందని, దీనివల్ల మరణించిన సుమారు 7,600 మంది రైతుల కుటుంబాలకు బీమా సొమ్ము దక్కకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యాప్‌ల పేరుతో కొత్త ఆంక్షలు విధిస్తూ, ఎకరాకు కేవలం రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తూ రైతులను ఇక్కట్లకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. “రేవంత్ రెడ్డి పాలనలో కొనుగోళ్లు ఖతమయ్యాయి.. రైతు భరోసా , రైతు బీమా ఖతమైంది.. మొత్తంగా తెలంగాణ రేవంత్ పాలనలో రైతులకు మిగిలింది ఏమీ లేదు” అంటూ హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు పెండింగ్ నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>