కలం, నల్లగొండ బ్యూరో: తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) ఊపందుకున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడం.. గుర్తుల కేటాయింపు సైతం కంప్లీట్ కావడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సాధారణ ఎన్నికలను తలదన్నేలా చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలబరిలో నిలిచిన అభ్యర్థులు గెలిచేందుకు నానాతంటాలు పడుతున్నారు. రాజకీయ పార్టీల మద్దతు మాత్రమే కాకుండా అభ్యర్థులు సైతం తమ సొంత అజెండాను అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఎవరికీ వారు మేనిఫెస్టోలను ప్రకటిస్తున్నారు. ప్రధానంగా సర్పంచ్ అభ్యర్థులు పల్లెపల్లెకూ ఓ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఓటర్లకు ఒక్కొక్కరికి ఒక్కో హామీనిస్తూ గెలిచేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వార్డుల్లోనూ అదే పరిస్థితి కన్పిస్తోంది.
పల్లెపల్లెకూ సపరేటు మేనిఫెస్టో..
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) గెలుపోటముల సంగతి పక్కన పెడితే.. సర్పంచ్ అభ్యర్థులు తమ గ్రామానికి సపరేటు మేనిఫెస్టోను ప్రకటించి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు బాండ్ పేపర్ల మీద వారి హామీలు ఫ్రింట్ చేయించి ఓటర్లకు అందిస్తుండగా, మరికొంతమంది సోషల్ మీడియా వేదికలుగా తమ హామీలు, వాగ్దానాలను కురిపిస్తున్నారు. ఇటీవల ఓ అభ్యర్థి అయితే ఏకంగా తన భార్యను వార్డు మెంబర్‌గా గెలిపిస్తే.. కటింగ్, షేవింగ్ ఉచితంగా చేస్తానని ప్రకటించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. మరొకరేమో.. గ్రామంలో పుట్టే ప్రతి ఆడబిడ్డకు రూ.2వేల చొప్పున అందజేస్తానని హామీనిచ్చారు. ఇలా చెప్పుకుంటూపోతే ఒక్కో గ్రామంలో ఒక్కో హామీ.. మనిషి మనిషికీ ఓ వాగ్దానం చేస్తుండడం గమనార్హం. మరోవైపు కులం, మతం ఆధారంగా ముమ్మరంగా సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను గంపగుత్తగా ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు వడ్డుతున్నారని చెప్పాలి.
గ్రామాభివృద్ధి కామన్ పాయింట్
ప్రస్తుతం జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు చెబుతున్న కామన్ పాయింట్ గ్రామాభివృద్ధి, అవినీతిరహిత పాలన. దాదాపుగా ప్రతి అభ్యర్థి హామీల్లో ఇది కన్పిస్తుంది. ఈ లెక్కన చూస్తే.. గ్రామంలో పెద్దఎత్తున అవినీతి జరుగుతుండడం.. అభివృద్ది జరగకపోవడం అనేది కన్పిస్తుంది. మరీ అలాంటప్పుడు ఓటర్లు పైసలోకో.. మద్యానికో.. కులం, మతం అభిమానానికో కాకుండా నిస్వార్థంగా తమ ఓటును వినియోగిస్తే.. పల్లెలు అభివృద్ధికి పట్టుగొమ్మలుగా మారడం ఖాయమని తెలుస్తోంది. మరీ ఈసారైనా అలాంటి నిర్ణయం తీసుకుంటారో.. లేదో వేచి చూడాల్సిందే.
Read Also: పట్టణవాసులకు పొంగులేటి గుడ్‌న్యూస్
Follow Us On: X(Twitter)


