కలం, నిజామాబాద్ బ్యూరో : పల్లెలు, పట్టణాల సర్వతోముఖాభివృద్ది కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే సత్వర ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం నిజామాబాద్ జిల్లా మోస్రా గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు.
వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల వివరాలను గ్రామ సభలో ఒక్కో పథకం వారీగా పేరుపేరున కలెక్టర్ (Collector Ila Tripathi) ప్రకటించారు. పలువురు లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల తమకు చేకూరిన ప్రయోజనాల గురించి గ్రామసభలో తమ అనుభవాలను తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రగతి, సంక్షేమంలో వారిని భాగస్వామ్యం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయడం జరుగుతోందని అన్నారు.
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు చేరేలా అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా కృషి చేయాలని సూచించారు. మహిళలు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాలని, తగిన పౌష్టిక ఆహారం తీసుకోవాలని హితవు పలికారు. వేసవిలో సంక్రమించే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ముందస్తుగానే తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. గ్రామ సభలో మోస్రా సర్పంచ్ శ్రీకాంత్, మండల ప్రత్యేక అధికారి రతన్, ఎం.పీ.డీ.ఓ శ్రీనివాస్, ఎం.పీ.ఓ వెంకటేశ్వర్లు, గ్రామ కార్యదర్శి శ్రవణ్, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Read Also: మీకు నిధులు, మాకు బాధలా? మంత్రులూ.. ఖమ్మం ఏజెన్సీకి నిధులేవి!
Follow Us On: Instagram

