కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి పద్మ శ్రీ అవార్డులు (Padma Shri Award) ప్రకటిస్తోంది. దీనిలో భాగంగా విద్య–సాహిత్యం విభాగంలో ప్రముఖ విద్యావేత్త, ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ కుమార్‌కు పద్మ శ్రీ అవార్డు ప్రకటించింది. ఈయనది తెలంగాణలోని నల్గొండ జిల్లా మామిడాల గ్రామం. ప్రస్తుతం ఐఐఎం కోల్‌కతా ఛైర్మన్‌గా ఉన్న ప్రొఫెసర్ జగదీశ్ కుమార్.. 2022 నుంచి 2025 వరకు యూజీసీ ఛైర్మన్‌గా పనిచేశారు. అంతకుముందు ప్రఖ్యాత జేఎన్‌యూ వర్సిటీకి వీసీగా కూడా ఉన్నారు. యూజీసీ ఛైర్మన్ అయిన రెండో తెలుగు వ్యక్తి ఆయనే కావడం గమనార్హం. గతంలో ప్రొఫెసర్ రాంరెడ్డి సేవలందించారు.
ఈ అవార్డు నా తల్లిదండ్రులకు అంకితం..
పద్మ శ్రీ అవార్డు రావడంపై ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ స్పందించారు. అత్యున్నత పౌర పురస్కారం దక్కడం ఆనందంగా ఉందన్నారు. తనకు ఈ అవార్డ్ వచ్చిందనే తెలియగానే.. మొదట తన తల్లిదండ్రులే గుర్తుకు వచ్చారన్నారు. వారే.. తనను అన్ని విధాలుగా నడిపిస్తూ వచ్చారని, అలాగే విద్యార్థుల పాత్ర మరవలేనిదన్నారు. వారి ప్రశ్నల ద్వారానే తాను మరింత నేర్చుకోగలిగినట్లు వివరించారు.

