కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ రూరల్ మండలం గాజులపేట (Gajulapeta) గ్రామపంచాయతీ కార్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించిన కలెక్టర్, పంచాయతీ తీర్మానం లేకుండానే నిధులు వినియోగించినట్లు గుర్తించారు. అలాగే, పంచాయతీ కార్యదర్శి చూపించిన కొన్ని తీర్మానాలు నకిలీగా ఉన్నట్లు పరిశీలనలో తేలింది. రికార్డుల నిర్వహణకు సంబంధించిన పత్రాలు కూడా సక్రమంగా లేవని కలెక్టర్ గుర్తించారు. దీంతో గాజులపేట పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గ్రామపంచాయతీ నిధుల వినియోగం, రికార్డుల నిర్వహణలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దోమల నివారణ కోసం వినియోగించే ఫాగింగ్ మిషన్ల వివరాలు, వాటి సంఖ్య, నిర్వహణకు సంబంధించిన రిజిస్టర్లను కూడా ఆమె పరిశీలించారు. అనంతరం గాజులపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. అక్షయపాత్ర ద్వారా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం 10వ తరగతి గదిని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రస్తుతం ఏ పాఠ్యాంశం జరుగుతోందని అడిగి తెలుసుకున్నారు. చదువు ఎలా సాగుతోంది, ఉపాధ్యాయులు పాఠాలను బాగా బోధిస్తున్నారా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ ఆరా తీశారు. పాఠశాలలో విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు, లైట్లు అందుబాటులో ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి తరగతి గదిలో ఫ్యాన్లు, లైట్లు తప్పనిసరిగా ఉండేలా చూడాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన విద్య అందించాలని పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.
మద్యం వాహనం సీజ్‌కు ఆదేశం
గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో అనుమతులు లేకుండా మద్యం తరలిస్తున్న వాహనాన్ని కలెక్టర్ గుర్తించారు. గ్రామంలోని బెల్ట్‌షాపులకు అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలని సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే, అక్రమ మద్యం విక్రయాలకు సంబంధించి బాధ్యులైన వారి లైసెన్స్ రద్దుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో మహబూబ్‌నగర్ రూరల్ తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీవో తదితర అధికారులు పాల్గొన్నారు.

