కలం, స్పోర్ట్స్: ప్రపంచ హాకీ వేదికపై భారత మహిళల జట్టు పోరాడుతున్న వేళ.. ఝార్ఖండ్ పల్లెల్లో మరో కథ నడుస్తోంది. సిమ్డేగా, ఖుంటి, గుమ్లా జిల్లాల్లో చిన్నారులకు హాకీ శిక్షణ (Jharkhand Hockey) కొనసాగుతోంది. దశాబ్దాలుగా సాగుతున్న ఈ సంప్రదాయం ఇప్పుడు మరింత బలపడుతోంది. ఝార్ఖండ్ హాకీకి ఎంతో కాలంగా పెద్ద అండగా ఉంది. ప్రస్తుత భారత మహిళల జట్టు కెప్టెన్ సలీమా టెటే దీనికి ఒక ఉదాహరణ. 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం అందించిన జైపాల్ సింగ్ ముండా ఈ హాకీ ప్రయాణానికి బలమైన పునాది వేశారు. ఆ తర్వాత మైఖేల్ కిండో, సిల్వానస్ డుంగ్‌డుంగ్, మనోహర్ టోప్నో, అజిత్ లక్రా, బిమల్ లక్రా, బిరేంద్ర లక్రా, అసుంటా లక్రా, సుమ్రాయ్ టెటే వంటి ఆటగాళ్లు ఈ వారసత్వాన్ని కొనసాగించారు.
హాకీ నర్సరీగా సిమ్డేగా..
ఈ ప్రభావం పల్లెల్లోనూ కనిపిస్తోంది. ముఖ్యంగా సిమ్డేగా, ఖుంటి, గుమ్లా ప్రాంతాల్లో హాకీ జీవనశైలిలో భాగమైంది. సిమ్డేగాను హాకీ నర్సరీగా పిలుస్తారు. గతంలో వసతులు తక్కువగా ఉన్నా, ఇక్కడి నుంచి పలువురు ఆటగాళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వ హాకీ రెసిడెన్షియల్ సెంటర్లో అండర్-12 నుంచి అండర్-16 వరకు బాలబాలికలకు శిక్షణ ఇస్తున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో పాటు రెంగారి, జల్డేగా, కుర్డేగ్లో నాన్-రెసిడెన్షియల్ కేంద్రాలు ఉన్నాయి.
ఖుంటి కూడా కీలక హాకీ కేంద్రంగా ఎదిగింది. బాలబాలికల కోసం రెసిడెన్షియల్ సదుపాయాలు ఉన్నాయి. 40 పడకల బాలికల హాస్టల్ ఉంది. గోవింద్పూర్, టోర్టా, ముర్హు, ఖుంటి, మరన్హాడాలో శిక్షణ కేంద్రాలు కొనసాగుతున్నాయి. గుమ్లా, కామ్డారా, కొన్బీర్, రాంచీ, లాతేహార్, హుల్హుండు, హజారీబాగ్లోనూ హాకీ శిక్షణ విస్తరించింది. ఈస్ట్ సింగ్భూమ్లో టాటా అకాడమీ ఉంది. జంషెడ్‌పూర్‌లో నేషనల్ హాకీ అకాడమీ ఉంది. ఈ వ్యవస్థలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక పాత్ర పోషిస్తోంది.
సాయ్ కేంద్రాల్లో శిక్షణ..
రాంచీ, హజారీబాగ్ కేంద్రాలు, మొరాబాది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ప్రతిభ ఉన్న ఆటగాళ్లను గుర్తిస్తున్నారు. శిక్షణకే పరిమితం కాకుండా క్రీడా శాస్త్రం, ఫిట్నెస్, ఫిజియోథెరపీ, పోషకాహారం, మానసిక సిద్ధతపై కూడా దృష్టి పెడుతున్నారు. పోటీల్లో పాల్గొనే అవకాశాలు కల్పిస్తున్నారు. 10 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న ఆటగాళ్లకు పలు ప్రాంతాల్లో ఎంపిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంపికైన వారికి రాంచీ, హజారీబాగ్‌లోని సాయ్ కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్నారు.
ఈ శిక్షణ ఫలితాలు జాతీయ జట్టులో కనిపిస్తున్నాయి. నిక్కీ ప్రధాన్, సలీమా టెటే, స్వీటీ డుంగ్‌డుంగ్, దీపికా సోరెంగ్ భారత మహిళల సీనియర్ జట్టులో చోటు సంపాదించారు. జూనియర్ మహిళల విభాగంలో పార్వతి టోప్నో, బినిమా ధాన్, సుగ్నా సంగా, నీలం టోప్నో, శ్రుతి కుమారి, ఖిల్లీ కుమారి వంటి ప్రతిభావంతులు ఎదుగుతున్నారు. పురుషుల జూనియర్ జట్టులో ఆశిష్ తానిపుర్తి కూడా గుర్తింపు పొందుతున్నాడు. హాకీ అభివృద్ధిలో టాటా సంస్థల పాత్ర కూడా ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు..
గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. యువ ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చే కోచ్‌లకు ఆర్థిక సహాయం అందుతోంది. కొన్ని కేంద్రాల్లో వసతి సదుపాయాలు కూడా ఉన్నాయి. గత 16 ఏళ్లలో ఝార్ఖండ్ హాకీ ఇండియా జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో మంచి ఫలితాలు సాధించింది. మహిళల విభాగాల్లోనే 34 పతకాలు గెలుచుకుంది. ఇందులో 10 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇదే సమయంలో కొత్త క్రీడా విధానం ద్వారా ఈ వ్యవస్థకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది.
2026-31 కేలో ఇండియా పథకంలో ప్రతిభ గుర్తింపు, మౌలిక వసతులు, క్రీడా సాంకేతికతకు ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్రాల పాత్రను కూడా పెంచారు. రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికలో కేంద్రం, రాష్ట్రం 60:40 నిష్పత్తిలో ఖర్చు భరించే విధానం ఉంది. ఆటగాళ్ల ప్రతిభ, కొనసాగింపు, పల్లె స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదుగుదల వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఝార్ఖండ్‌లోని సిమ్డేగా, ఖుంటి, రాంచీ, హజారీబాగ్, గుమ్లా తదితర ప్రాంతాల్లో వేలాది మంది చిన్నారులు హాకీ నేర్చుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెసిడెన్షియల్, నాన్-రెసిడెన్షియల్ కార్యక్రమాల్లో 5,000 మందికి పైగా శిక్షణ పొందుతున్నారు.

